గోపూజతో ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: మహాభారతంలోని అరణ్య పర్వంలో పాండవులు విన్న కథలలో బృహదశ్వమహర్షి చెప్పిన నలదమయంతుల కథ, నమ్మకం ఉన్న వారికి శ్రవణమాత్రం చేతనే కలి దోషాలను హరిస్తుందని ప్రవచనకర్త డా. బోలుగద్దె అనిల్ కుమార్ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ ఆధ్వర్యంలో నంద్యాల మండలం, పెద్ద కొట్టాల గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంనందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక కార్యక్రమాలలో భాగంగా వారు నాలుగవరోజు వారు భక్తులనుద్దేశించి మాట్లాడుతూ పాపాలను, కలిబాధలను తొలగించి పుణ్యజీవితం కలగడానికి నలదమయంతుల కథలోని సందేశం అన్ని కాలాల్లోని ప్రజలకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందని, నలదమయంతులు పవిత్రమైన జీవనం వలననే ఋతుపర్ణ మహారాజు దైవికవిద్య, కర్కోటకుని నాగశక్తి అనుకూలించి నలదమయంతులకు కలిబాధలు తొలగిపోయాయని , మనం పవిత్రమార్గంలో ప్రయాణిస్తే ప్రకృతి, దైవం మనకు అనుకూలిస్తుందని, పవిత్రమైన జీవనం చేసే వారికి తాత్కాలిక కష్టాలు తొలగి శాశ్వత సుఖాలు కలుగుతాయని అన్నారు. కార్యక్రమాల ముగింపు సందర్బంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మప్రచారపరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, ఇస్కాన్ ధర్మ ప్రచారకులు నిత్యతృప్తదాసు స్వామి, శ్రీరామాలయం కమిటీ చైర్మన్ అన్నెపురెడ్డి నాగప్రసాద్ రెడ్డి, గండా బాలశివారెడ్డి, సుబ్బారావు, రాముడు, పెద్ద వీరయ్య, లక్ష్మిదేవి, ఈశ్వరరావు, కుమ్మరి మద్దిలేటి, ఎస్. ఎఫ్. ఎఫ్. మహిళా ప్రతినిధి ఇందిరాదేవి, బి.బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


