రెండేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలకు మోసం, రాష్ట్రానికి అరాచకం – ఎమ్మెల్యే
1 min read
హామీలు గాలికొదిలి ప్రచారంతో కాలం గడుపుతున్నారు
మెగా డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి
ప్రజాసంక్షేమం పూర్తిగా దెబ్బతింది – వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన పోరాడుతుంది
ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గ కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆలూరు ఎమ్మెల్యే శ్రీ బుసినే విరుపాక్షి తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతూ రాష్ట్రంలో గత రెండేళ్లుగా ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ దుర్మార్గ, రాక్షస, అరాచక పాలన కొనసాగుతోందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అబద్ధపు ప్రచారాలతో కాలం గడుపుతున్న ప్రభుత్వం, వాస్తవ పరిస్థితులను దాచిపెట్టేందుకు అన్ని వ్యవస్థలను వినియోగిస్తోందని విమర్శించారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకపోయినా, అన్నీ అమలు చేశామని ప్రచారం చేయడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పక్కనబెట్టి ప్రభుత్వం కేవలం ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఐదేళ్లలో చేసిన అప్పులను కూటమి ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే మించిపోయిందని ఆరోపించారు. పేద ప్రజలు వైద్యం, విద్య కోసం అధిక ఖర్చులు భరించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇవి రాజకీయ ఆరోపణలు కాదని, క్షేత్రస్థాయిలో ప్రజలు అనుభవిస్తున్న వాస్తవ పరిస్థితులేనని స్పష్టం చేశారు.మెగా డీఎస్సీ నియామకాల విషయంలో భారీ అక్రమాలు జరిగాయని, వాటిపై ఆధారాలతో సహా వైఎస్సార్సీపీ బయటపెట్టినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. అసలు అంశంపై సమాధానం చెప్పాల్సిన వారు మౌనం వహిస్తూ ప్రజల దృష్టి మరల్చేందుకు ఇతర విషయాలను తెరపైకి తీసుకువస్తున్నారని విమర్శించారు.మెగా డీఎస్సీ ప్రక్రియలో నిబంధనల మార్పులు, అభ్యర్థులకు జరిగిన అన్యాయాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తుతో ఆటలాడే హక్కు ప్రభుత్వానికి లేదని అన్నారు.ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడం, వేధింపులకు గురిచేయడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతి గొంతును అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో సంక్షేమ ఫలాలు అందాయని, ప్రజల ఖాతాల్లో నేరుగా నిధులు జమయ్యేవని గుర్తు చేశారు. పేదల అభ్యున్నతే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారని అన్నారు.టిడ్కో ఇళ్ల విషయంలో ప్రజలపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించే చర్యలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకుందని, ఆరోగ్యశ్రీ వంటి పథకాల ద్వారా లక్షలాది కుటుంబాలకు భరోసా కల్పించిందని చెప్పారు. ప్రస్తుతం ఆ పథకాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మేధావులు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, మహిళలు, యువత ఆలోచించాలని కోరారు. ప్రజా సమస్యలపై విస్తృత చర్చ జరగాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయో ప్రజలే పరిశీలించాలని పిలుపునిచ్చారు.ప్రజల పక్షాన పోరాడే బాధ్యతాయుత ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ కొనసాగుతుందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమిస్తుందని ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, బీవీఆర్ అభిమానులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.



