జలధార – జలహారతి పనులకు వేగం పెంచాలి
1 min read
మంజూరైన పనులన్నీ క్షేత్రస్థాయిలో పూర్తి చేయాలని ఆదేశం
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: జిల్లాలో అమలవుతున్న జలధార – జలహారతి కార్యక్రమ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్‌లో సంబంధిత అధికారులతో కార్యక్రమ పురోగతిపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జలధార – జలహారతి కార్యక్రమ అమలులో వేగం పెంచడంతో పాటు, ప్రతి పని క్షేత్రస్థాయిలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో మొత్తం 1952 పనులు మంజూరు కాగా, వాటిలో ప్రస్తుతం 1231 పనులు గ్రౌండింగ్ దశలో ఉన్నాయని తెలిపారు. ‘అదర్స్’ కేటగిరీలో సుమారు 400 పనులు యాప్‌లో సరిగా ప్రతిబింబించడం లేదని, ఆ సాంకేతిక సమస్య పరిష్కారమైతే గ్రౌండింగ్‌లో ఉన్న పనుల సంఖ్య 1600 దాటుతుందని వివరించారు. పెండింగ్లో ఉన్న పనులను కూడా తక్షణమే గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. స్ట్రక్చర్ ప్లాన్లలో 90 శాతం పూర్తవగా, విలేజ్ ప్లాన్లు 73 శాతం మాత్రమే పూర్తయ్యాయన్నారు. జిల్లాలోని 330 చెరువులు, 191 గ్రామాలకు సంబంధించిన ట్యాంక్ ప్లాన్లు పూర్తయ్యాయని వెల్లడించారు. ఇంకా సుమారు 2,500 స్ట్రక్చర్లను పరిశీలించాల్సి ఉందని, అవి పూర్తయిన తర్వాతే విలేజ్ ప్లాన్లు అప్లోడ్ అవుతాయని స్పష్టం చేశారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమయానికి కేటాయించిన ప్రతి పని క్షేత్రస్థాయిలో అమలు కావాలని, సంబంధిత అధికారులు గ్రామస్థాయికి వెళ్లి ఫోటోలు, జియో కోఆర్డినేట్లు సేకరించి యాప్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.కొలిమిగుండ్ల మండలం హనుమంతుగుండం చెరువు పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సుమారు 18 కిలోమీటర్ల కాలువ పనులు జరుగుతున్నాయని తెలిపారు. అందులో 14.5 కిలోమీటర్లకు అనుమతులు లభించగా, మిగిలిన 3.5 కిలోమీటర్ల పనులకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ కూలీలు చేయలేని పనులకు స్వచ్ఛంద మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు. చెరువులు, కాలువల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని, ఒక ప్రాంతంలో విజయం సాధిస్తే మిగిలిన 27 చెరువుల గొలుసుకట్టు పనులకు కూడా ఇది ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

