NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆస్తి వివాదం నేపథ్యంలో మహిళ హత్య

1 min read

సులువాయి గ్రామంలో విషాదం – కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

హోలగుందన్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గ పరిధిలోని సులువాయి గ్రామంలో ఆస్తి వివాదం నేపథ్యంలో జరిగిన ఘోర సంఘటన గ్రామంలో కలకలం రేపింది. కుటుంబ ఆస్తి తగాదాలు చివరకు హత్యకు దారితీయడంతో గ్రామ ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు.పోలీసుల వివరాల ప్రకారం… సులువాయి గ్రామానికి చెందిన హరిజన గాదిలింగకు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య కుటుంబానికి, గాదిలింగ రెండో భార్య హరిజన యల్లమ్మకు మధ్య కొంతకాలంగా ఆస్తి విషయంలో తీవ్ర విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ వివాదాల నేపథ్యంలో తరచూ కుటుంబ కలహాలు చోటుచేసుకుంటున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు.21-05-2026 రాత్రి సమయంలో గాదిలింగ మొదటి భార్య కుమారుడు షేకన్న, ఇంటి బయట నిద్రిస్తున్న హరిజన యల్లమ్మపై దాడి చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. పదునైన ఆయుధంతో నరికి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది. ఘటన సమయంలో బాధితురాలు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది.ఈ ఘటనపై మృతురాలి కుమార్తె గుండమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆస్పరి సీఐ శ్రీనివాస నాయక్, ఇన్‌చార్జి ఆలూరు సర్కిల్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సమాచారం.ఘటన విషయం తెలిసిన వెంటనే గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ ఆస్తి వివాదాలు ఇలాంటి దారుణాలకు దారితీయడం బాధాకరమని స్థానికులు పేర్కొన్నారు. గ్రామంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికానున్నాయని పోలీసులు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *