అభివృద్ధిపై మాట్లాడే హక్కు వైసిపి పార్టీకి లేదు…
1 min read

వైసీపీ పాలనలో రోడ్లు కనబడలేదా….?
న్యూస్ నేడు హొళగుంద : వైసిపి పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆలూరు అభివృద్ధిపై మాట్లాడే హక్కు లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రి స్వామి, పంపాపతి, సిబిఎన్ ఆర్మీ మండల అధ్యక్షుడు ముల్లా మోయిన్,జాకీర్,తిప్పన్న,మహేష్, శాలి మెహబూబ్ భాష,పీరన్న, అబ్దుల్ రెహమాన్ అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి గత ఐదేళ్ల పాలనలో ఒక రోడ్డు అయినా వేశారా అని సూటిగా ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టిన నాటి నుండి హోళగుంద మండల పరిధిలోని వన్నూరు క్యాంప్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశామన్నారు.హోళగుంద ఆలూరు రోడ్డుకు మరమ్మత్తులు చేయడం జరిగిందని తెలిపారు.అదేవిధంగా హోళగుంద – చిన్నహేట రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని ఇవన్నీ వైసిపి నాయకులకు కనబడవా అని ప్రశ్నించారు. రోడ్ల గురించి ఇప్పుడు ప్రశ్నిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి, వైసిపి నాయకులు గత ఐదేళ్లలో వాళ్లు చేసిన అభివృద్ధి పనులను ఒకటైన చూపించగలరా అని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం కూటమి ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలు అభినందిస్తున్నానని గుర్తు చేశారు. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు. దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు,తల్లికి వందనం పథకం అమలుతో రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారని అన్నారు. త్వరలో అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పథకాలను అమలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నారని అన్నారు. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియ సాగుతుందని, వైసీపీ హయాంలో ఒక్క డీఎస్సీ అయినా నిర్వహించారా అని ప్రశ్నించారు. హోళగుంద ధనాపురం రోడ్డు సమస్య సీఎం దృష్టిలో ఉందని త్వరలోనే రోడ్డు నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారని అన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై నిందలు వేయడం మానుకోవాలని అన్నారు.

