కుడా నిధులతో నగరంలో 100 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు
1 min read

రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి టీజీ భరత్
కర్నూలు, న్యూస్ నేడు : కుడా నిధులు రూ.29.84 లక్షలతో కర్నూలు నగరంలో 100 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్ లో కర్నూలు నగరంలో 100 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుకు సంబంధించి కుడా నిధులు రూ.29.84 లక్షల చెక్ ను మంత్రి చేతుల మీదుగా కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కు అందించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని ప్రోత్సహిస్తూ ఉంటారని తెలిపారు. వారి ఆశయాల మేరకు జిల్లాలో కర్నూలు నగరంలో ఏ ఐ టెక్నాలజీ తో కూడిన 100 సిసి టీవీ కెమెరాలను కూడా నిధులతో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇదివరకే నగరంలో 150 సీసీటీవీ లను మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామన్నారు. ఈ అధునాతన సిసి టీవీ కెమెరాల ద్వారా నగరం లో నేరాల నియంత్రణకు వీలవుతుందని, క్రిమినల్స్ తప్పించుకోలేరని మంత్రి తెలిపారు.. సి సి టీవీ కెమెరాలకు రూ.30 లక్షల నిధులు మంజూరు చేసిన కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కర్నూలు నగరం శాంతి భద్రతలతో ప్రశాంతంగా ఉండేందుకు, నేరాల నియంత్రణకు తోడ్పడాలన్న లక్ష్యంతో కుడా నిధులు మంజూరు చేశామని తెలిపారు.జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా మాట్లాడుతూ రహదారి భద్రత లో భాగంగా ట్రాఫిక్ నియంత్రణ కు వీలుగా నగరంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు.. ఇదివరకే మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 150 కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రస్తుతం కుడా నిధులతో మరో 100 అత్యాధునిక సాఫ్ట్వేర్ తో కూడిన కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కర్నూలు నగరంలో ఏడుకోట్లతో రోడ్ల నిర్మాణం, సుందరీకరణ పనులను చేపట్టడం జరుగుతోందని తెలిపారు.జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ నగరంలో 250 కెమెరాల తో నియంత్రణకు వీలుగా పకడ్బందీ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఇన్విజిబుల్ పోలీస్ – విజిబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యత ఇస్తున్నామని అందులో భాగంగానే సాఫ్ట్వేర్ తో కూడిన 100 కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతోందని తెలిపారు.జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య మాట్లాడుతూ కర్నూలు నగరంలో సర్వేలెన్సు, శాంతిభద్రతలు మరింత మెరుగుపడేందుకు వీలుగా కుడా నిధులతో 100 సిసిటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కుడా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


