NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెట్రోల్, డీజిల్  కొరత లేదు

1 min read

ప్రజలు ఆందోళన చెందవద్దు…జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి

కర్నూలు, న్యూస్​ నేడు: జిల్లాలో పెట్రోల్,  డీజిల్ సరఫరాపై  కొరత లేదని, అవసరానికి తగినంత నిల్వ ఉందని,  ప్రజలు ఆందోళన చెందవద్దు అని   జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి  తెలిపారు.శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో పెట్రోల్, డీజిల్ సరఫరా అంశాలపై  జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…జిల్లాలో మొత్తం 166 పెట్రోల్ బంకులు పనిచేస్తుండగా, అవి బిపిసిఎల్, హెచ్‌పి, ఐఓసీఎల్, జియో, నయారా వంటి ప్రధాన కంపెనీలకు చెందినవని చెప్పారు. జిల్లాలో రోజువారీగా సగటున 2,36,000 లీటర్ల పెట్రోల్ వినియోగం జరుగుతుండగా, ప్రస్తుతం జిల్లాలో 7 లక్షల లీటర్ల పెట్రోల్ నిల్వ ఉందని తెలిపారు. అదనంగా ట్రాన్సిట్‌లో 6,39,000 లీటర్లు ఉండటంతో మొత్తం కలిపి 13,19,439 లీటర్ల పెట్రోల్ అందుబాటులో ఉందని వెల్లడించారు. ఈ నిల్వలతో 6 నుంచి 7 రోజుల వరకు సరఫరా కొనసాగించగలమని స్పష్టం చేశారు. డీజిల్ విషయంలో కూడా ఎటువంటి కొరత లేదని తెలిపారు. జిల్లాలో రోజుకు సగటున 3,16,848 లీటర్ల డీజిల్ సరఫరా జరుగుతుండగా, ప్రస్తుతం 5,65,000 లీటర్ల డీజిల్ నిల్వ మరియు ట్రాన్సిట్‌లో 5,06,564 లీటర్లు ఉన్నాయని చెప్పారు. మొత్తం కలిపి 11 లక్షల లీటర్ల డీజిల్ అందుబాటులో ఉండటంతో సుమారు 4 రోజుల సరఫరా నిరంతరంగా కొనసాగుతుంది అని తెలిపారు. అయితే, ప్రజలు భయంతో అధికంగా పెట్రోల్, డీజిల్‌ను క్యాన్లు, డబ్బాలు, బ్యారెల్స్‌లో నిల్వ చేసుకోవడం వల్ల జిల్లాలోని 166 బంకుల్లో 32 బంకులు తాత్కాలికంగా డ్రై అవుట్ అయ్యాయని పేర్కొన్నారు.   పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోతుందని, ధరలు పెరుగుతాయని ప్రచారం జరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. కానీ వాస్తవానికి ఎక్కడా ధరలు పెరగలేదు, సాధారణ ధరలకే సరఫరా జరుగుతోందని స్పష్టం చేశారు. ప్రస్తుతం పెట్రోల్ ధర సుమారు రూ.109, డీజిల్ ధర రూ.97 వద్ద ఉన్నాయని వివరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకోవద్దని, అపోహలు నమ్మకుండా సాధారణంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ విధంగా అధికంగా కొనుగోలు చేయడం వల్ల నిజంగా అవసరమైన వారికి ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు.  జిల్లాలో పెట్రోల్, డీజిల్ తగినంత ఉంది,  ఎటువంటి కొరత లేదు. ప్రజలు భయపడవద్దు, అపోహలను నమ్మకూడదని అని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. పెట్రోల్, డీజల్ ను బ్లాక్ లో అమ్మితే కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *