NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కొన్నేళ్ల నిరీక్షణకు తెర..22 A భూ సమస్యల పరిష్కారం!

1 min read

జిల్లా కలెక్టర్ చొరవపై హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు

22 ఏ లో ఉన్న భూములను తొలగించుకోవడానికి మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలనే ప్రక్రియ గురించి పెద్ద ఎత్తున ప్రజలలో అవగాహన కల్పించాలి

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు, న్యూస్​ నేడు : జిల్లాలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న 22A భూ సమస్యలను పరిష్కరించి జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి లబ్ధిదారులకు  స్వయంగా తొలగింపు ఉత్తర్వులను అందజేశారు.కలెక్టరేట్ కార్యాలయంలో 22 A భూ సమస్యల పరిష్కారం చేసిన రైతులకు 22 A తొలగింపు ఉత్తర్వులను కలెక్టర్  రైతులకు అందచేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దాదాపు కొన్ని సంవత్సరాలుగా పరిష్కారం కాని భూ సమస్యలు ఇప్పుడు కొలిక్కి రావడంతో బాధితుల ముఖాల్లో చిరునవ్వులు విరిశాయన్నారు. భూ సమస్యల పరిష్కారంలో ఎవరైనా అధికారులు లంచం అడిగారా అని కలెక్టర్ ఆరా తీయగా.. “ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, అధికారులు చాలా బాగా సహకరించారు” అని ప్రజలు బదులిచ్చారు.. వీఆర్ఓ (VRO), సర్వేయర్లు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సరైన మార్గదర్శకత్వం చేయడంతో ప్రక్రియ సులువుగా పూర్తయినట్లు లబ్ధిదారులు కలెక్టర్ తెలిపారు. కొన్ని ఏళ్ల పెండింగ్ సమస్యలు ఇంత వేగంగా, అవినీతికి తావు లేకుండా పరిష్కారం కావడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయన్నారు.22 ఏ లో ఉన్న భూములను తొలగించుకోవడానికి మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలనే ప్రక్రియ గురించి ప్రజలలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. తాము కూడా ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ఎంతమంది సమస్యలు పరిష్కారమయ్యాయి అని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  ప్రజలు సంతృప్తిగా ఉండాలనే విషయాన్ని చెప్పారన్నారు. రెవెన్యూ శాఖపై ఉన్న ప్రతికూల అభిప్రాయాన్ని  తొలగించేందుకు కృషి చేస్తున్నామన్నారు.  22A భూముల డెలిషన్లు ఖచ్చితంగా జరగాలన్నారు. కొన్ని చోట్ల పట్టా భూములను ఇనామ్ భూములుగా మార్చిన సందర్భాలు ఉన్నాయని, దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. అటువంటి 36,000 కేసులను పరిష్కరించాము అన్నారు.  ఇంకా ఎవరికైనా ఇలాంటి భూ సమస్యలు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని, రికార్డులు సరిచూసి, నిజమైతే తప్పకుండా పరిష్కరిస్తాం అని కలెక్టర్ తెలిపారు. గతంలో భూమి రికార్డులలో “గవర్నమెంట్” అని పడిపోవడం వల్ల, రైతులు తమ సొంత భూమిని అమ్ముకోవడానికి, తాకట్టు పెట్టడానికి లేదా పిల్లల చదువుల కోసం లోన్ తీసుకోవడానికి వీలు లేకుండా పోయిందన్నారు. ఇప్పుడు ఆ సమస్యలు అన్ని పరిష్కారం అయ్యాయన్నారు. దాదాపు 36,000 కేసులను పరిష్కరించి, ఆ భూములను తిరిగి రైతుల పేరు మీదకు మార్చడం జరిగిందన్నారు. ఇప్పుడు ఆ భూమి మళ్ళీ వారి సొంతం కావడం వల్ల అమ్మాయిల పెళ్లిళ్లకు లేదా ఇతర అవసరాలకు వారు ఆ భూమిని వినియోగించుకోవచ్చు అన్నారు. భూమి రికార్డులు సరికావడం వల్ల ‘అన్నదాత సుఖీభవ’ వంటి ప్రభుత్వ పథకాల డబ్బులు కూడా మళ్ళీ రైతుల ఖాతాల్లో పడుతున్నాయన్నారు. ఈ మార్పుల గురించి అందరికీ తెలియజేయాలని, దీనివల్ల ఇంకా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారు కూడా ముందుకు వచ్చి తమ భూమి రికార్డులను సరిచేయించుకుంటారని అధికారి సూచించారు. అనంతరం లబ్ధిదారులు తమ  ఆనందాన్ని వ్యక్తం చేస్తూ  కొన్ని ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న తమ భూ చిక్కులు ఇప్పుడు పరిష్కారమవ్వడంపై ప్రజలు కలెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత నవంబర్ మరియు ఈ ఏడాది ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకున్న మాకు కూడా తక్కువ సమయంలోనే న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు.. రైతులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో ఇంచార్జి డిఆర్ఓ చిరంజీవి, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, కర్నూలు రూరల్ తహసిల్దార్ రమేష్, సెక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author