జిల్లాస్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
1 min read
విద్యార్థిదశ నుంచే విద్యతో పాటు క్రీడలు, వృత్తినైపుణ్యం వైపు విద్యార్థులు అడుగులు వెయ్యాలి
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో మంగళవారం 2025–26 విద్యా సంవత్సరానికి జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎస్ఎస్ సి పబ్లిక్ పరీక్షలలో ప్రభుత్వ పాఠశాలలలో జిల్లాస్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన 34 మంది విద్యార్థిని, విద్యార్థులకు వారి ప్రధానోపాధ్యాయులు,తల్లి, తండ్రులు సమక్షంలో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ప్రతిభా పురస్కారాలు అందజేసి, పేరుపేరున పలకరించి అభినందించారు. విద్యార్థులతో మమేకం అయ్యి భవిషత్తు కార్యాచరణను జిల్లా కలెక్టరు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు వారి తల్లి,తండ్రులు వారి మనోభావాలను జిల్లా కలెక్టరుతో పంచుకుని,ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో రాష్ట్రానికి, మన జిల్లాకు మంచి గుర్తింపు తెచ్చేది విద్య, క్రీడలు మాత్రమేనని యువత ఆలోచనలు చేసి, ముందుకు అడుగులు వెయ్యాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ అనేక వినూత్న మార్పులతో విద్యావ్యవస్థను మరింత అభివృద్ధి చేస్తోందన్నారు. ప్రతి విద్యార్థి నిర్దిష్టలక్ష్యాన్ని ఎంచుకుని, ప్రణాళికతో ముందుకు సాగితే తప్పక విజయం సాధించవచ్చునని తెలిపారు. జిల్లాలో ప్రతి విద్యార్థి అంకిత భావంతో, ప్రణాళికా బద్ధంగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు విజయానికి ఉపాధ్యాయులు కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, సాంకేతికతతో కూడిన వినూత్న బోధన పద్ధతులను ప్రవేశ పెడుతున్నామని తెలిపారు. విద్యార్థులు శారీరక, మానసిక వికాసానికి క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. చిన్నవయస్సు నుంచే భావ వ్యక్తీకరణ, మంచిని వినడం, ఆలోచన శక్తివంటి లక్షణాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ప్రైవేటు పాఠశాలలుపై ఉన్న అపోహలను విడనాడి ప్రభుత్వ పాఠశాలలు ప్రాముఖ్యతను గుర్తించాలని తల్లిదండ్రులకు సూచించారు. నిరుపేదలకు విద్య అత్యంత శక్తివంతమైన ఆయుధమని, తల్లిదండ్రులు కష్టాన్ని గుర్తించి విద్యార్థులు కష్టపడి చదవాలని అన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను కూడా ముందుకు తీసుకురావడంలో ప్రభుత్వ పాఠశాలలు విశేషకృషి చేస్తున్నాయని తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థులు తల్లులు ఖాతాల్లో ఒక్కో విద్యార్థికి రూ 15 వేలు చొప్పున జమ చేస్తున్నామని అన్నారు. ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నామని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువులు చదివి విద్యార్థులు బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకటలక్ష్మమ్మ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిడి వై.విశ్వమోహన్ రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతులు సంక్షేమ శాఖ డిడి ఆర్.వి.నాగరాణి, సర్వశిక్ష అభియాన్ ఏపిసి కె.పంకజ్ కుమార్, డిసివో యన్.భారతి, వట్లూరు పియం బి.ఆర్ అంబేద్కర్ గురుకులం ప్రిన్సిపాల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి, మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాలలు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.


