NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజల ముంగిటకే రెవెన్యూ సేవలు

1 min read

ఒక నెల-ఒక గ్రామం కార్యక్రమాన్ని ప్రారంభించిన దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్

పెదవేగి మండలం విజయరాయి గ్రామ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే

రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అధికారుల చొరవ పెరగాలి – ఈ కార్యక్రమం ద్వారా ఆ గ్రామంలో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అధికారులు కృషి చేయాలి

 పారదర్శకమైన పాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదవేగి విజయరాయిప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన “ఒక నెల – ఒక గ్రామం – నాలుగుసార్లు సందర్శించుట” అనే కార్యక్రమం దెందులూరు నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైంది. గురువారం ఉదయం పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభలో దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్  మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. “ఒక నెలలో ఒక గ్రామాన్ని అధికారులు నాలుగుసార్లు సందర్శించడం ద్వారా స్థానికంగా ఉన్న సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి, పరిష్కరించే అవకాశం ఉంటుందని” వివరించారు.రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు అందే సేవలు అత్యంత పారదర్శకంగా ఉండాలని ఎమ్మెల్యే చింతమనేని స్పష్టం చేశారు. ముఖ్యంగా భూ రికార్డులు, పట్టాదారు పాస్ పుస్తకాలు మరియు ఇతర వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాల విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మొదటి గురువారం లో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను  పరిష్కరించేలా కృషి చేయాలని, తదుపరి గురువారాల్లో జరిగే కార్యక్రమాల్లో ఆయా అర్జీల యొక్క స్థితిగతులను పరిష్కార దిశగా తీసుకున్న చర్యలను గ్రామస్తులకు వివరించాలని, అదేవిధంగా నాలుగవ వారంలో పూర్తయిన అర్జీల స్థితిని ప్రజలకు వివరించి నెలరోజుల తర్వాత ఆ గ్రామంలో సమస్యలనేవి లేకుండా ఉండేలా కృషి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అధికారులు చొరవ చూపి, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని హితవు పలికారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో నడవాలని ఎమ్మెల్యే చింతమనేని  ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన వినతులపై తక్షణమే స్పందించి, తదుపరి సందర్శన సమయానికే పురోగతి ఉండాలని అధికారులకు సూచించారు.ఈ గ్రామ సభలో మండల రెవెన్యూ అధికారి (తాసిల్దార్) భ్రమరాంబ, ఎంపీడీవో నాగేంద్ర, సహా పలువురు మండల స్థాయి అధికారులు, గ్రామ రెవెన్యూ సిబ్బంది, కూటమి నాయకులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

About Author