గజ్జహల్లి వీరన్న బావిలో 70 రోజుల పూడికతీత పనులకు ముగింపు
1 min read
భక్తుల సౌకర్యార్థం రహదారి నిర్మించాలని గ్రామస్తుల విజ్ఞప్తి
హోళగుందన్యూస్ నేడు; హొళగుంద మండల పరిధిలోని గజ్జహల్లి గ్రామంలో ఉన్న ప్రసిద్ధ వీరన్న బావిలో గత 70 రోజులుగా కొనసాగిన పూడిక తీత పనులను మంగళవారం నిలిపివేశారు. పురాతన చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ బావి గ్రామస్థులకు ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది.ప్రతి ఏడాది శ్రావణ మాసం సందర్భంగా మాత్రమే కాకుండా మొహరం పండుగల సమయంలో కూడా ఈ బావి వద్ద భారీగా భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మొహరం సందర్భంగా పీర్లను ఈ బావిలోనే నిమజ్జనం చేయడం ఇక్కడి ప్రత్యేక సంప్రదాయంగా కొనసాగుతోంది.దాదాపు 60 మెట్లతో నిర్మితమైన ఈ పురాతన బావి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రస్తుతం భద్రతా దృష్ట్యా బావిలో కాంక్రీట్ మెట్లు నిర్మించే పనులు కొనసాగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. పనులు పూర్తయిన అనంతరం ఈరన్న తాతకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.అయితే బావికి వెళ్లే మార్గం సరిగా లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పండుగల సమయంలో రాకపోకలకు అంతరాయం కలుగుతోందని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు స్పందించి వీరన్న బావికి వెళ్లే రహదారి నిర్మాణం చేపట్టి భక్తులకు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


