టిడ్కో గృహ సముదాయాల నిర్మాణం, మౌళిక వసతులు ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ
1 min read
50వేల లీటర్ల కెపాసిటీ తో మంచినీటి రిజర్వాయర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: కూటమి ప్రభుత్వ ఆలోచనలకు ప్రతిరూపంగా నిలిచే టిడ్కో ఇళ్ళకు తుదిరూపునిచ్చే బాధ్యతను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఇళ్ళ అభివృద్ధిలో జరుగుతోన్న పనే అందుకు ప్రత్యక్ష నిదర్శనమంటూ ఆయన వెల్లడించారు. ఏలూరులోని 19వ డివిజన్ కొత్తూరు ఇందిరమ్మ కాలనీ వద్ద చేపట్టిన టిడ్కో గృహ సముదాయాల నిర్మాణం, మౌళిక వసతుల కల్పనా పనులు తుది అంకానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా అక్కడ జరుగుతోన్న అభివృద్ధి పనులను జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం అక్కడ లబ్దిదారుల సౌకర్యార్థం నిర్మించ తలపెట్టిన 50వేల లీటర్ల కెపాసిటీ కలిగిన మంచినీటి రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. తొలుత ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం అక్కడ జరుగుతోన్న అభివృద్ధి పనులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పేదలందరికీ ఇళ్ళు మంజూరు చేయాలనే కూటమి ప్రభుత్వ సత్ సంకల్పానికి టిడ్కో ఇళ్ళు ప్రతిరూపాలని అభివర్ణించారు. 2014-19 మధ్యకాలంలో వీటి నిర్మాణాన్ని 80శాతం పూర్తిచేయగా,,, 2019-24 మధ్య గత వైసిపి ప్రభుత్వ పాలనలో టిడ్కో ఇళ్ళ నిర్మాణ పనులు నిర్లక్ష్యానికి గురై అటకెక్కాయన్నారు. గత వైసిపి ప్రభుత్వ పాలకుల చేతకాని తనం కారణంగా అప్పట్లోనే మంజూరు కావాల్సిన 4వేల 600 ఇళ్ళు రద్దయ్యాయంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలూరు నియోజకవర్గంలోని కొత్తూరు ఇందిరమ్మ కాలనీ వద్ద 13కోట్ల, 75లక్షల రూపాయల నిధులతో చేపట్టిన 288 ప్లాట్లతో కూడిన 6టవర్ల టిడ్కో ఇళ్ళ నిర్మాణానికి తుది రూపునిచ్చేందుకు శ్రమిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే వీటిని లబ్దిదారులకు అందజేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట డిప్యూటి మేయర్ కర్రి శ్రీనివాస్, కో-ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, కార్పొరేటర్ యర్రంశెట్టి నాగబాబు,క్లస్టర్ ఇంచార్జ్ పైడి వెంకట్రావు, డివిజన్ ఇంచార్జ్ పైడి పార్వతి, కో విజన్ ఇంచార్జ్ అంబటి రజిని, కూటమి నాయకులు వందనాల శ్రీనివాస్, రెడ్డి నాగరాజు, గాది రాంబాబు, స్థానిక నాయకులు కాశిల శ్రీనివాసరావు, పటాకుల సాంబమూర్తి,చౌదరి లక్ష్మణరావు,తుమ్మరాడ శ్రీనివాస్,ఈఈ తోట వెంకట నారాయణరావు తదితర కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

