ఓటు హక్కు పరిరక్షణలో బీఎల్‌ఏల పాత్ర కీలకం
1 min read
– ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి
ఆలూరు న్యూస్ నేడు: ఆలూరునియోజకవర్గంలోని హాలహర్వీ మండలం క్షేత్రగుడి ఆంజనేయస్వామి కళ్యాణమండపంలో శుక్రవారం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్)పై బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి, ఆలూరు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు రామచంద్రారెడ్డి, హాలహర్వీ మండల కన్వీనర్ శ్రీ రామిరెడ్డి, ఆలూరు అసెంబ్లీ బూత్ కమిటీ అధ్యక్షులు సుధాకర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, దాని పరిరక్షణలో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.జూన్ 15 నుంచి జూలై 14 వరకు జరిగే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో ఓటరు ధృవీకరణ, కుటుంబ వివరాల పరిశీలన, ముసాయిదా ఓటరు జాబితా పరిశీలన, దరఖాస్తులు, అభ్యంతరాల నమోదు తదితర అంశాలపై బీఎల్‌ఏలు పూర్తిస్థాయిలో పట్టు సాధించాలని తెలిపారు.ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉండేలా చూడటంతో పాటు, అర్హత లేని వ్యక్తులు లేదా ఆ ప్రాంతంలో నివసించని వారి పేర్లు నమోదు కాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. బీఎల్‌ఏలు గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి బాధ్యులతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో పనిచేయాలని, ప్రభుత్వ అధికారులు, బూత్ స్థాయి అధికారులతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలని అన్నారు.ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి పొరపాట్లు, అక్రమాలు చోటుచేసుకోకుండా ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించిన ఆయన, ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వెంటనే పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు.ఆలూరు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు శ్రీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పార్టీ గుర్తింపు కార్డుల ధృవీకరణ ప్రక్రియ శాతం వంద పూర్తికావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను కూడా అదే స్థాయిలో పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.కార్యక్రమంలో హాలహర్వీ మండల బూత్ లెవెల్ ఏజెంట్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, రాష్ట్ర, జిల్లా, మండల కమిటీ సభ్యులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


