వరల్డ్ బ్రెయిన్ డే 22 జూలై – మెదడు ఆరోగ్యంపై అవగాహన అవసరం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ప్రతి సంవత్సరం జూలై 22న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే వరల్డ్ బ్రెయిన్ డే (World Brain Day) సందర్భంగా మెదడు ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు వైద్య నిపుణులు వెల్లడించారు. మెదడు సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించి సరైన సమయంలో చికిత్స తీసుకుంటే ప్రాణాలను కాపాడటమే కాకుండా శాశ్వత వైకల్యాలను కూడా నివారించవచ్చని తెలిపారు.ఈ సందర్భంగా సీనియర్ న్యూరోసర్జన్ డా. విశ్వ కుమార్ కె.ఎస్. మాట్లాడుతూ, “మెదడు మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవం. తరచూ తలనొప్పి, మూర్ఛలు, చేతులు లేదా కాళ్లలో బలహీనత, చూపులో మార్పులు, మాట తడబడటం, సమతుల్యత కోల్పోవడం వంటి లక్షణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి బ్రెయిన్ ట్యూమర్, స్ట్రోక్ లేదా ఇతర న్యూరోలాజికల్ సమస్యలకు సంకేతాలు కావచ్చు. సమయానికి నిపుణులను సంప్రదించి అవసరమైన స్కానింగ్, పరీక్షలు చేయించుకుంటే అనేక క్లిష్టమైన వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి విజయవంతంగా చికిత్స చేయవచ్చు” అని తెలిపారు.అలాగే ఆయన మాట్లాడుతూ, “ప్రస్తుతం ఆధునిక న్యూరోసర్జరీ, హై-ఎండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, మైక్రోసర్జికల్ మరియు మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతుల ద్వారా గతంతో పోలిస్తే మెదడు సంబంధిత అనేక క్లిష్టమైన శస్త్రచికిత్సలను మరింత సురక్షితంగా నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్ట్రోక్, బ్రెయిన్ ట్యూమర్లు, తలకు తీవ్రమైన గాయాలు వంటి సందర్భాల్లో సమయానికి చికిత్స పొందడం అత్యంత కీలకం” అని వివరించారు.డా. విశ్వ కుమార్ ప్రజలకు సూచిస్తూ, రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచడం, ధూమపానం మరియు మద్యపానానికి దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం వంటి అలవాట్లు మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.


