కవ్వగుంట గ్రామంలో కొత్త పశువులు ఆసుపత్రికి అనుమతులు మంజూరు చెయ్యాలి
1 min read
పిజిఆర్ఎస్ లో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అర్జీ
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశమందిరంలో సోమవారం నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటికి, పెదవేగి మండలం కవ్వగుంట గ్రామానికి క్రొత్త పశువైద్యశాల నిర్మాణానికి పరిపాలన అనుమతులను మంజూరు చెయ్యాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అర్జీని సమర్పించారు.ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ పెదవేగి మండలం కవ్వగుంట గ్రామంలో గోపాలరావు అండ్ కో వారి భూ విరాళంతో మరియు గ్రామ పంచాయతీ నిధులతో 1968వ సంవత్సరంలో ఒక పశువైద్యశాల నిర్మించ బడిందని, కాని ఈ ఆసుపత్రిని 2008-2011 మధ్య కాలంలో కూల్చివేసి పోలవరం కాలువ భూసేకరణలో కలిపారని అన్నారు. రైతులు, పాడి రైతులు ఆసుపత్రి మరియు అనుబంధ సేవలు లేక బాధపడుతున్నారని తెలిపారు. అందువల్ల మాగ్రామ ప్రాంగణంలో కొత్త ఆసుపత్రిని నిర్మించడానికి పరిపాలన అనుమతులను మంజూరు చెయ్యాలని కోరామని తెలిపారు. గ్రామంలో పశువైద్యశాల ఏర్పాటు జరిగితే పశువులకు సకాలంలో వైద్యసేవలు అందడంతో పాటు పాడిపరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు. రైతులు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖ అధికారులు త్వరితగతిన స్పందించి పశువైద్యశాల నిర్మాణానికి అనుమతులు మంజూరు చెయ్యాలని కోరారు. రైతులు,పాడి రైతులు సంక్షేమమే లక్ష్యంగా నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమం మరియు అవసరమైన మౌళిక వసతులు కల్పన కోసం నిరంతరం కృషిచేస్తున్నట్లు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా రెవిన్యూ అధికారి ఎల్.దేవకీదేవి,ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్న ,జిల్లా పంచాయతీశాఖ అధికారి జి.మల్లిఖార్జున రావు, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.


