హై డెన్సిటీ ప్లాంటేషన్‌తో పచ్చదనానికి ప్రాధాన్యం ఇవ్వాలి
1 min read
ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను మోడల్ గ్రీన్ క్యాంపస్‌లుగా తీర్చిదిద్దాలి
కలెక్టర్ జి. రాజకుమారి
నంద్యాల, న్యూస్ నేడు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో హై డెన్సిటీ ప్లాంటేషన్‌ను విస్తృతంగా చేపట్టి పచ్చదనం పెంపొందించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్‌లో హై డెన్సిటీ ప్లాంటేషన్ కార్యక్రమాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ సూర్యనారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చింతామణి, డీఈఓ జనార్ధన్ రెడ్డి, హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ ప్రతినిధులు శర్వానన్ సుబ్రమణ్యం, జయసూర్య, ఆశ్రిత, అంకిత కుమారి, రాజశేఖర్, శరత్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు మరియు వసతి గృహాల ప్రాంగణాల్లో హై డెన్సిటీ ప్లాంటేషన్ ద్వారా పర్యావరణహిత వాతావరణాన్ని సృష్టించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో ఒక పాఠశాలను ఎంపిక చేసి సోక్ పిట్స్, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలు, వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు, సోలార్ సదుపాయాలు తదితర అంశాలను సమగ్రంగా ఏర్పాటు చేసి దానిని ఆదర్శ గ్రీన్ మోడల్ పాఠశాలగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.అదేవిధంగా రాతినేలలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కూడా హై డెన్సిటీ ప్లాంటేషన్ విజయవంతంగా అమలు చేయడానికి అనువైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, అందుకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించాలని హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ ప్రతినిధులను కోరారు.హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ ప్రతినిధి శర్వానన్ సుబ్రమణ్యం మాట్లాడుతూ, వర్షాకాలంలో లభించే నీటిని సమర్థవంతంగా నిల్వ చేసుకోవడం అత్యంత అవసరమన్నారు. నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, వర్షపు నీటి నిర్వహణ కార్యక్రమాలను విస్తృత స్థాయిలో అమలు చేయడం ద్వారా జిల్లాలో పచ్చదనం గణనీయంగా పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.

