శ్రీనివాస నగర్ ప్రధాన రహదారి వైట్‌టాప్ నిర్మాణంలో ప్రభుత్వ శాఖల సమన్వయ లోపం
1 min read
ప్రమాదంలో మరణించిన ఇమాంసా కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి
ప్రజా సమస్యలపై పౌర సమాజం స్పందించాలి.
బొజ్జా దశరథరామిరెడ్డి
కర్నూలు, న్యూస్ నేడు: శ్రీనివాస నగర్ ప్రధాన రహదారిలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కార్పెంటర్‌గా జీవనోపాధి పొందుతూ తన పేద కుటుంబానికి ఆధారంగా ఉన్న ఇమాంసా మృతి చెందడం అత్యంత బాధాకరమైన సంఘటన అని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం నంద్యాల సమితి కార్యాలయం నందు దశరథరామిరెడ్డి మాట్లాడుతూ..శ్రీనివాస నగర్ ప్రధాన రహదారిలో తారు రహదారి స్థానంలో వైట్‌టాప్ (సిమెంట్) రహదారి నిర్మాణ పనులు చేపట్టిన నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం, నిర్మాణ ప్రాంతంలో తగిన భద్రతా చర్యలు లేకపోవడం, అలాగే వాహన డ్రైవర్ నిర్లక్ష్యం కలిసి ఈ ప్రమాదానికి కారణమైనట్లు స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.ఈ రహదారి పరిసర ప్రాంతాల్లో అనేక ఆసుపత్రులు, మెడికల్ షాపులు ఉండటంతో ప్రతిరోజూ రోగులు, వృద్ధులు, మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నారని, నిర్మాణ పనులను క్రమబద్ధంగా మరియు వేగవంతంగా పూర్తి చేయడంలో విఫలమవడం వల్ల ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. పరిస్థితి తీవ్రతను గమనించినప్పటికీ సంబంధిత శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోందన్నారు.”అభివృద్ధి పనులు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారకూడదు. ప్రజల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయడం ప్రభుత్వ శాఖల బాధ్యత. మృతుడి కుటుంబ సభ్యులకు మరోసారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు.

