రైతులకు శాశ్వత సాగునీటి భద్రతే లక్ష్యం: ఎమ్మెల్యే
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: డోన్ మండలంలోని కొత్తబుర్జు గ్రామ సమీపంలో ఉన్న తిప్పమ్మ కుంట మరియు వెంగళం కుంటలను డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువుల ప్రస్తుత పరిస్థితి, నీటి నిల్వ సామర్థ్యం, అభివృద్ధి పనుల అవసరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, డోన్ నియోజకవర్గంలోని రైతాంగానికి సాగునీటి ఇబ్బందులు లేకుండా చేయడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. వర్షపు నీటిని పూర్తిస్థాయిలో నిల్వ చేసుకునే విధంగా చెరువుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. చెరువుల పునరుద్ధరణ ద్వారా భూగర్భ జలాలు పెరిగి రైతులకు, గ్రామ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.ప్రజల అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, నియోజకవర్గ అభివృద్ధిలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి గ్రామం అభివృద్ధి బాటలో ముందుకు సాగేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


