NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

14 రకాల నిత్యావసర వస్తువులను రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు అందించాలి

1 min read

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్

సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టం చేయడంతో పాటు,రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులను ప్రజలకు అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ డిమాండ్ చేశారు.భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఏలూరు ఏరియా, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య(ఎన్.ఎఫ్.ఐ. డబ్ల్యూ)ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో పేద,మధ్యతరగతి ప్రజలు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోగా కూటమి ప్రభుత్వం ఉన్న రేషన్ కార్డులను తొలగిస్తుందని ఆరోపించారు. చాలీ చాలని వేతనాలతో జీవిస్తున్న పేద ప్రజలు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడం వల్ల పౌష్టికాహార లోపానికి గురవుతున్నారని విచారం వ్యక్తం చేశారు.  కేరళ రాష్ట్రంలోని గత ఎల్డీఎఫ్ ప్రభుత్వం 18 రకాల నిత్యావసర వస్తువులను పేద ప్రజలకు అందించేదని గుర్తు చేశారు.తక్షణమే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని,14 రకాల నిత్యావసర వస్తువులను రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు. సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ 2024 ఎన్నికల సందర్భంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తాము అధికారంలోకి వస్తే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని చెప్పి,అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు తగ్గించలేదని ఎద్దేవా చేశారు.ధరల పెరుగుదలను నియంత్రించటంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని అన్నారు.నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు,స్కూల్ ఫీజులు పెరుగుతుండటంతో సామాన్య ప్రజల జీవనం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు నిరంతరం పెరుగుతున్న కారణం చేత నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరగడం వల్ల పేద ప్రజలు, ముఖ్యంగా మహిళలు సరైన పోషకాహారాన్ని తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల 50శాతం మంది మహిళలు రక్తహీనతతో,అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని,పౌష్టికాహారం అందక దేశవ్యాప్తంగా లక్షలాది మంది పసి పిల్లలు మృతి చెందుతున్నారని విచారం వ్యక్తం చేశారు.ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం మాత్రమే సరఫరా చేస్తున్నారని ప్రజల ఆహార భద్రతను,జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు బియ్యంతో పాటు,కంది పప్పు,మంచినూనె,మొక్కజొన్నలు,చక్కెర,కారం,పసుపు,జీలకర్ర,పామాయిల్, కొబ్బరి నూనె,ఆవాలు,జొన్నలు,పల్లీలు,సబ్బులు కలిపి 14 రకాల నిత్యావసర సరుకులు రేషన్ షాపుల ద్వారా అందించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం స్పందించని పక్షంలో ఈ ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వర రావు,సిపిఐ ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, సహాయ కార్యదర్శి కురెళ్ళ వరప్రసాద్, ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షులు కొంపల్లి కృష్ణమాచార్యులు,జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీనివాస డాంగే,జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు,ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ యామిని,సిపిఐ ఏలూరు జిల్లా కౌన్సిల్ సభ్యులు భజంత్రీ శ్రీనివాసరావు,ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శి కొల్లూరి సుధారాణి,సిపిఐ ఏలూరు ఏరియా కార్యవర్గ సభ్యులు మావూరి విజయ గొర్లి స్వాతి శాయన అభిలాష్ కుమార్ కౌన్సిల్ సభ్యులు ఎం.ఎ.హకీమ్,లక్కోజు జగదీశ్వరి,ఉప్పులూరి లక్ష్మి,భవాని,జ్యోతి,నిస్సి,ఆలూరి రమేష్, రంగమ్మ,అబ్రహం,ఆదినారాయణ,సుందరమ్మ,జట్ల సంఘం నాయకులు యాదగిరి శ్రీను,కరణం నానాజీ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *