NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హొళగుంద, హెబ్బటం పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్

1 min read

విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదు

మధ్యాహ్న భోజనం, గుడ్ల నాణ్యత, విద్యా ప్రమాణాలపై సమగ్ర సమీక్ష

హొళగుందన్యూస్ నేడు: హొళగుంద మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెబ్బటం, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హొళగుందలను ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, ఆహార నాణ్యత, పాఠశాల నిర్వహణపై సమగ్రంగా పరిశీలించారు.ముందుగా హెబ్బటం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో మధ్యాహ్న భోజన తయారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించిన ఆయన, వంటశాల పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని స్వయంగా రుచి చూసి, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన నాణ్యమైన ఆహారం అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.అనంతరం పాఠశాల ఎండీఎం స్టోర్‌రూమ్‌ను పరిశీలించిన సందర్భంగా విద్యార్థులకు పంపిణీ చేస్తున్న కోడిగుడ్ల పరిమాణంలో కొంత వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయులు కబీర్ సాబ్ దృష్టికి తీసుకెళ్లి, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా గుడ్లు సరఫరా అయ్యేలా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన ఆహారం అందేలా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.తదుపరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హొళగుందను సందర్శించి పాఠశాల రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం నూతనంగా నియమితులైన డీఎస్సీ ఉపాధ్యాయులతో సమావేశమై విద్యార్థులకు బోధన ఎలా సాగుతోందో తెలుసుకున్నారు. విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడేలా కృషి చేయాలని సూచిస్తూ, పాఠశాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రధానోపాధ్యాయులకు హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా విజయ్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి నాణ్యమైన పోషకాహారం అత్యంత కీలకమని, మధ్యాహ్న భోజన పథకం అమలులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత, విద్యా ప్రమాణాల విషయంలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారి-2, మండల తహసీల్దార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు (ఇన్‌చార్జ్), ఉపాధ్యాయ సిబ్బంది, పాఠశాల కమిటీ చైర్మన్, సభ్యులు, సీఆర్‌పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్, డీటీపీ ఆపరేటర్లు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *