NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థుల ఆరోగ్యంతో రాజీ లేదు… ప్రజల ఆహార భద్రతపై రాజీపడే ప్రసక్తే లేదు!

1 min read

ప్రతి విద్యార్థికి నాణ్యమైన, పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలి… ప్రతి అర్హ కుటుంబానికి రేషన్ సరుకులు సకాలంలో చేరాలి!

పాఠశాలలు, కేజీబీవీలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్లు, రేషన్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి

ఆహార నాణ్యత, పరిశుభ్రత, ప్రజా పంపిణీ వ్యవస్థపై అధికారులకు కీలక ఆదేశాలు – నిర్లక్ష్యం, అక్రమాలు, అవకతవకలు సహించేది లేదని స్పష్టం

హోళగుందన్యూస్ నేడు: ప్రజల ఆహార భద్రతను కాపాడటం, విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించడం ప్రభుత్వ అత్యున్నత బాధ్యత అని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ, మధ్యాహ్న భోజన పథకం, అంగన్‌వాడీ పోషకాహార కార్యక్రమాలు అత్యంత పారదర్శకంగా, నాణ్యతతో అమలుకావాలని, ప్రజల ఆరోగ్యంతో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని ఆయన స్పష్టం చేశారు.గురువారం హొళగుంద మండలంలోని హొళగుంద, హెబ్బటం గ్రామాల్లో పర్యటించిన ఆయన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ, అంగన్‌వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రజా పంపిణీ రేషన్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న మధ్యాహ్న భోజనం, తాగునీరు, పరిశుభ్రత, మౌలిక వసతులు, ఆహార నాణ్యతపై ఆరా తీశారు. గ్రామ ప్రజలతో మాట్లాడి రేషన్ సరుకుల పంపిణీపై సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు.అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, పాఠశాలలు, అంగన్‌వాడీలు, హాస్టళ్లలో అందించే ప్రతి భోజనం పోషక విలువలు కలిగి ఉండాలని, వంటశాలల పరిశుభ్రత, సురక్షిత తాగునీరు, ఆహార పదార్థాల నిల్వ ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. పిల్లల ఆరోగ్యానికి హాని కలిగించే చిన్నపాటి నిర్లక్ష్యాన్ని కూడా ప్రభుత్వం సహించదని హెచ్చరించారు.ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం, పప్పులు, చక్కెరతో పాటు ఇతర నిత్యావసర సరుకులు ప్రతి అర్హ కుటుంబానికి నిర్ణీత సమయంలో, సరైన పరిమాణంలో అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పంపిణీలో అక్రమాలు, అవకతవకలు, ఫిర్యాదులకు ఏమాత్రం తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హొళగుంద తహసీల్దార్ ఎం. లక్ష్మీరాజు, డిప్యూటీ తహసీల్దార్ నిజాముద్దీన్, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ దీపా, ఆర్‌ఐ మహేష్ గౌడ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *