NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలి: ఎస్‌టీయూ డిమాండ్

1 min read

30 శాతం మధ్యంతర భృతి ప్రకటించి పెండింగ్ బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి

సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరిన జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సి. సుంకన్న

హోళగుంద న్యూస్ నేడు:  రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ, ఎన్నికల మేనిఫెస్టోలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చిన హామీలైన 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, మధ్యంతర భృతి (ఐఆర్) మంజూరు, ఆర్థిక బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు తదితర హామీలను అమలు చేయలేదని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సి. సుంకన్న ప్రభుత్వాన్ని విమర్శించారు. వెంటనే 12వ పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేసి 30 శాతం ఐఆర్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.ఎస్‌టీయూ మండల శాఖ అధ్యక్షుడు కె. శరణభసప్ప, మండల ప్రధాన కార్యదర్శి డి. పాండురంగ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఎం.సి. సుంకన్న మాట్లాడుతూ, 11వ పీఆర్సీ గడువు పూర్తై 30 నెలలు గడిచినా ఇప్పటికీ 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు. 2023 జూలై నుంచి అమలు కావాల్సిన 12వ పీఆర్సీ అమలులో జాప్యం జరుగుతున్నందున వెంటనే కమిషన్‌ను ఏర్పాటు చేసి 30 శాతం ఐఆర్ ప్రకటించాలని కోరారు.2024 జూన్ నాటికి గత ప్రభుత్వంలో దాదాపు రూ.23 వేల కోట్ల ఆర్థిక బకాయిలు పెండింగ్‌లో ఉండగా, ప్రస్తుతం అవి సుమారు రూ.34 వేల కోట్లకు చేరడం ఆందోళనకరమన్నారు. 11వ పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలు, సరెండర్ లీవ్, పీఎఫ్, మెడికల్ బిల్లులు తదితర పెండింగ్ చెల్లింపులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ అంశాన్ని పునఃసమీక్షించి రాష్ట్రంలో వెంటనే ఓపీఎస్ అమలు చేయాలని కోరారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 15 నెలలుగా గ్రాట్యుటీ చెల్లింపులు నిలిచిపోయాయని, ఈఎల్ ఎన్‌క్యాష్‌మెంట్ బిల్లులు మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రావాల్సిన నాలుగు డీఏలను కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈహెచ్‌ఎస్ కార్డు ద్వారా రిఫరల్ ఆస్పత్రుల్లో అన్ని రకాల వ్యాధులకు పూర్తిస్థాయి నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని, 2025లో బదిలీలు కోరుకున్న ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని, నాలుగు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సర్వీస్ రూల్స్ రూపొందించి అమలు చేయాలని కోరారు. అలాగే గత ప్రభుత్వం శాసన మండలిలో ఇచ్చిన హామీ మేరకు కేజీబీవీల్లో బోధన సిబ్బందికి ఎంటీఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు కోరుతున్న టెట్ మినహాయింపు అంశంపై విద్యా హక్కు చట్టంలోని 23(1) సెక్షన్‌ను సవరించి ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా పార్లమెంట్ చట్ట సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో మండల ఆర్థిక కార్యదర్శి కే. శ్రీనివాసులు, మండల గౌరవ అధ్యక్షుడు ఎస్. పోతరాజు, మండల సహాయ గౌరవ అధ్యక్షుడు జి. దొడ్డ బసప్ప, బి. గాదిలింగప్ప, ఎన్. ఈరన్న, డి. చిన్నప్పరెడ్డి, వై. వెంకటేష్, బీ.టి. ఖలందర్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *