NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్‌ఐఆర్ – 2026 ప్రక్రియను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలి

1 min read

ఎన్యూమరేషన్ ఫారమ్‌ల డిజిటలైజేషన్‌లో ఖచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి

పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల, న్యూస్​ నేడు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలో చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్-2026) కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా వేగవంతంగా, పారదర్శకంగా, నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం నంద్యాల పట్టణంలోని ఎం.ఎస్. నగర్ ప్రాంతంలో కొనసాగుతున్న ఎన్యూమరేషన్ ఫారమ్‌ల డిజిటలైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా 111 నుంచి 115 వరకు, అలాగే 125వ పోలింగ్ స్టేషన్ పరిధిలో చేపడుతున్న డిజిటలైజేషన్ పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించి, నమోదు ప్రక్రియ, డేటా అప్‌లోడ్ విధానం, పత్రాల ధృవీకరణ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో ప్రతి ఎన్యూమరేషన్ ఫారమ్‌ను అత్యంత జాగ్రత్తగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఓటర్ల వివరాల నమోదులో ఖచ్చితత్వం అత్యంత కీలకమని, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ఎన్నికల జాబితాపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రతి దశలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సూచించారు.అనంతరం నంద్యాల పట్టణంలోని 108, 149 నుంచి 152 వరకు ఉన్న పోలింగ్ కేంద్రాలను కూడా జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడ కొనసాగుతున్న ఎస్‌ఐఆర్-2026 కార్యక్రమం అమలు తీరును పరిశీలించి, ఎన్యూమరేషన్ ఫారమ్‌ల సేకరణ, డిజిటలైజేషన్, రికార్డుల నిర్వహణ, పెండింగ్ వివరాల పరిష్కారం వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఎన్యూమరేషన్ ఫారమ్‌ల డిజిటలైజేషన్‌ను నిర్దేశించిన కాలపట్టిక ప్రకారం వేగవంతం చేయడంతో పాటు, ప్రతి నమోదును క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఫీల్డ్ స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేసి, ప్రతిరోజూ నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని, పెండింగ్ లేకుండా ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు.ఎస్‌ఐఆర్-2026 కార్యక్రమం విజయవంతం కావడానికి అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తు.చ తప్పకుండా అమలు చేస్తూ ప్రజలకు పారదర్శకమైన, విశ్వసనీయమైన ఓటరు జాబితా అందించే దిశగా కృషి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సూచించారు. ఈ తనిఖీలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, నంద్యాల అర్బన్ తహశీల్దార్ శ్రీనివాసులుతో పాటు సంబంధిత ఎన్నికల శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *