మద్దికేర మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
1 min read
న్యూస్ నేడు, పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గం మద్దికేర మండలంలో మంగళవారం జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో కే.ఈ. శ్యామ్ కుమార్ పాల్గొన్నారు. మద్దికేర పట్టణంలోని సాయినగర్ , మద్దమ్మకుంట సమీపంలో నిర్మాణం పూర్తయిన రెండు ఓహెచ్ఎస్ఆర్ తాగునీటి ట్యాంకులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కొత్త ఊపు వచ్చిందన్నారు. ప్రజలకు అవసరమైన ప్రతి మౌలిక సదుపాయాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటోందని పేర్కొన్నారు.మద్దికేర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే సంకల్పంతో ఈ రెండు OHSR ట్యాంకులను అందుబాటులోకి తీసుకువచ్చామని, నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.అనంతరం మద్దమ్మ అవ్వ కుంట వద్ద WDC–PMKSY 2.0 పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ పథకం ద్వారా వాకింగ్ ట్రాక్, సోలార్ లైట్స్, చిల్డ్రన్స్ పార్క్, ఓపెన్ జిమ్ వంటి ఆధునిక సౌకర్యాల ఏర్పాటుకు పనులు ప్రారంభమైనట్లు అధికారులు వివరించారు. ఈ పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అలాగే మద్దికేర తహసీల్దార్కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.



