NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థుల భోజన వసతి కోసం రూ.4 లక్షల విరాళం

1 min read

– పూర్వ విద్యార్థి మిక్కిలేని వెంకట శివప్రసాద్ సేవాభావం

హోళగుంద జెడ్పీ ఉన్నత పాఠశాలలో భోజనశాల నిర్మాణానికి చేయూత.. ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపు

హోళగుంద న్యూస్ నేడు : కర్నూలు జిల్లా హోళగుంద మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు భోజన వసతి సౌకర్యం లేకపోవడంతో, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు భోజనశాల నిర్మాణానికి పూర్వ విద్యార్థి, ఎల్‌ఎల్‌సీ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ మిక్కిలేని వెంకట శివప్రసాద్ తన వంతు సహాయంగా రూ.4 లక్షలు అందించారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలలో ప్రత్యేక భోజనశాల ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన నూతన భవన నిర్మాణానికి ఆయన ఆర్థిక సహకారం అందించడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం భోజనశాల నూతన భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మిక్కిలేని వెంకట శివప్రసాద్ మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సరైన భోజన వసతి కల్పించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు. పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థిగా విద్యార్థుల కోసం తన వంతు సహకారం అందించడం సంతోషంగా ఉందన్నారు. భోజనశాల నిర్మాణం ఒక్కరి సహకారంతో పూర్తయ్యేది కాదని, ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, గ్రామ పెద్దలు, దాతలు, తల్లిదండ్రులు, విద్యాభిమానులు అందరూ చేయి చేయి కలిపి ముందుకు రావాలని కోరారు.“మన పాఠశాల.. మన పిల్లలు.. మన బాధ్యత” అనే భావనతో ప్రతి ఒక్కరూ తమకు సాధ్యమైనంత సహాయం అందిస్తే విద్యార్థులకు మంచి వసతులతో కూడిన భోజనశాలను నిర్మించవచ్చని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో గ్రామ ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం, పౌష్టికాహారం అందితే వారి చదువులో మరింత పురోగతి సాధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కబీర్ సాబ్, మండల విద్యాశాఖాధికారి–2 కబీర్ సాబ్ రూ.50 వేల సహకారం అందించారు. పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు కూడా తమ వంతు సహకారం అందించాలని వారు కోరారు.భోజనశాల నిర్మాణానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి భవిష్యత్తులో మరింత మంది దాతలు ముందుకు వచ్చి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడానికి సహకరించాలని కోరారు.ఈ భూమిపూజ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజా, శివన్ గౌడ్, పంపన్ గౌడ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రైస్‌మిల్ మురళి, కడప్ప, దుర్గయ్య, తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ తిప్పయ్య, అబ్దుల్ సుభాన్, మల్లిక, ఎంపీపీ తనయుడు ఈసా తదితరులు పాల్గొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు కూడా కార్యక్రమంలో పాల్గొని భోజనశాల నిర్మాణానికి సహకరించిన దాతలను అభినందించారు.విద్యార్థుల భోజన వసతి కోసం చేపట్టిన ఈ నిర్మాణ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, దాతలు పెద్ద ఎత్తున సహకరించి భోజనశాల నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *