27 న సందేశాత్మక షార్ట్ ఫిలిం మరియు రీల్స్ పోటీలు
1 min read
తెలుగు షార్ట్ ఫిలిం అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.
కర్నూలు, న్యూస్ నేడు: తెలుగు చార్టర్డ్ ఫిల్మ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే “చిన్న సినిమా – పెద్ద సందేశం” రాష్ట్రవ్యాప్త షార్ట్ ఫిల్మ్, రీల్స్ పోటీలను ఈ ఏడాది కూడా సెప్టెంబర్ 27న నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డి. వి రాజు, రాష్ట్ర అధ్యక్షులు బి.కే.ఎన్. ఎస్ ప్రసాద్,రాష్ట్ర ఉపాధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలోని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి జరిగే ఈ పోటీల్లో షార్ట్ ఫిల్మ్స్‌కు మొదటి బహుమతి రూ.10,000, రెండో బహుమతి రూ.7,000, మూడో బహుమతి రూ.5,000, అలాగే రీల్స్ పోటీల్లో మొదటి బహుమతి రూ.5,000, రెండో బహుమతి రూ.3,000, మూడో బహుమతి రూ.2,000 అందజేయనున్నట్లు తెలిపారు. డిజిటల్ యుగంలో ప్రశ్నా పత్రాలపై వాటి ప్రభావం, శ్రమ గౌరవం, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజలపై ధరల ప్రభావం, విద్యా వైద్యం వ్యాపారమయం, కుల నిర్మూలన–భిన్నత్వంలో ఏకత్వం, అమెరికా–ప్రపంచంపై పెత్తనం–దురాక్రమణ యుద్ధాలు, ఏకపక్ష సంకేతాలు, మత విభజనలు–ప్రజల ఐక్యత, పర్యావరణ విధ్వంసం- ప్రజలపై దాని ప్రభావం, భారత రాజ్యాంగ పరిరక్షణ వంటి సామాజిక అంశాలపై షార్ట్ ఫిల్మ్స్, రీల్స్ రూపొందించి పోటీల్లో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుత సామాజిక సమస్యలు, ప్రజా జీవనంలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రతిబింబిస్తూ రూపొందించిన చిత్రాలకు ప్రాధాన్యత ఉంటుందని, యువత, కళాకారులు, షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోటీలకు సంబంధించిన ఎంట్రీలను సెప్టెంబర్ 20లోపు తెలుగుసఫా@gmail.comకు పంపించాలని, మరిన్ని వివరాలకు వెంకటరమణ కాలనీ మొదటి లైన్ లో ఉన్న నైస్ కంప్యూటర్స్ కార్యాలయంలో లేదా 9396861308 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు.


