సామూహిక వేడుకలు ఐకమత్యానికి ప్రతీక
1 min read
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెల్లడి
అప్పనవీడులో గణనాథునికి పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దెందులూరు నియోజకవర్గంలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పెదపాడు మండలం, అప్పనవీడు గ్రామంలో కొలువుదీరిన శ్రీ విఘ్నేశ్వరుని పలు మండపాలను దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ సందర్శించారు.ఈ సందర్భంగా గణనాథునికి ఎమ్మెల్యే చింతమనేని ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం ఉత్సవ కమిటీ నిర్వాహకులు, స్థానిక కూటమి నాయకులు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని శాలువాతో ఘనంగా సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, దెందులూరు నియోజకవర్గంలో వినాయక చవితి వేడుకలను ఇంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న ఆయా కమిటీ సభ్యులను, స్థానిక యువతను మనస్ఫూర్తిగా అభినందించారు. గ్రామాల్లో ప్రజలంతా కలిసికట్టుగా ఇలాంటి సామూహిక వేడుకలు నిర్వహించడం మన సంస్కృతిలో భాగమైన గొప్ప సంప్రదాయమని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా అందరినీ ఏకం చేసి, ప్రజల్లో ఐకమత్యాన్ని, పరస్పర సోదరభావాన్ని పెంపొందించేందుకు ఇటువంటి పండుగలు, వేడుకలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన ఆకాంక్షించారు.


