వాయు కాలుష్య నియంత్రణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు అమలు చెయ్యాలి
1 min read
పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పొల్యూషన్ నియంత్రణ చర్యలు చేపట్టాలి
శాస్త్రీయ అధ్యయనాలు ఆధారంగా కాలుష్య హాట్స్పాట్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి
కాలుష్య కారకాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి
ఇన్చార్జి జిల్లా కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు నగరంలో వాయుకాలుష్యాన్ని నియంత్రించేందుకు శాస్త్రీయ అధ్యయనాలు ఆధారంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు సిద్ధంచేసి, అమలు చెయ్యాలని ఇన్చార్జి జిల్లా కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ సంబంధిత శాఖలు అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేటు జిల్లా జాయింటు కలెక్టరు ఛాంబర్లో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్ సి ఎ పి ) పై జిల్లాస్థాయి సమీక్షసమావేశాన్ని ఇన్చార్జి జిల్లా కలెక్టరు అధ్యక్షతన నిర్వహించారు. నగరంలో గాలి నాణ్యతపై నిర్వహించిన శాస్త్రీయ అధ్యయనాలు వివరాలను పరిశీలించి, కాలుష్యానికి ప్రధాన కారణాలు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలుపై సమగ్రంగా చర్చించారు.ఈ సందర్భంగా ఇన్చార్జి జిల్లా కలెక్టరు డా.యం.జె. అభిషేక్ గౌడ మాట్లాడుతూ జిల్లాలో కాలుష్య హాట్స్పాట్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, శాస్త్రీయ అధ్యయనాలు ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆయా ప్రాంతాల్లో కాలుష్యానికి దారి తీస్తున్న కారణాలను గుర్తించి, వాటి నియంత్రణకు నిర్దిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించే వాహనాలుపై కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించాలని ఆదేశించారు. రవాణా, మైన్స్ తదితర శాఖలు సమన్వయంతో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఈ- ఆటోలు, సి ఎన్ జి వినియోగాన్ని ప్రోత్సహించాలని, నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు డీజిల్, పెట్రోల్ వాహనాలు వినియోగాన్ని తగ్గించి ఈ-ఆటోలు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. డీజిల్ ఆటోలను సి ఎన్ జి వాహనాలుగా మార్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి, ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. కాలుష్య కారకాలను గుర్తించి వాటిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్ధ కమీషనరు ఏ.భానుప్రతాప్, ప్రాంతీయ కాలుష్య నియంత్రణా మండలి ఇఇ ఏ.రామచంద్రమూర్తి, జిల్లా రోడ్డు ట్రాన్స్ పోర్టు అధికారి యస్.బి.శేఖర్, సిపిసిబి కన్సల్టెంటు ఏ.కోమలి, రవాణా, పోలీసు,వ్యవసాయ, కాలుష్య నియంత్ర మండలి, పౌరసరఫరాలు, అటవీ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.


