గురుకుల కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు పెంచాలి
1 min read
పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా కనీస వేతనం అమలు చేయాలి – సీఐటీయూ మండల ప్రధాన కార్యదర్శి ఎం. రవిచంద్ర
న్యూస్ నేడు, పత్తికొండ: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచాలని సీఐటీయూ పత్తికొండ మండల ప్రధాన కార్యదర్శి ఎం. రవిచంద్ర డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీఐటీయూ అనుబంధ గురుకుల కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఫిర్దోస్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎం. రవిచంద్ర, ఉద్యోగుల సంఘం కార్యదర్శి శ్రీలక్ష్మి మాట్లాడుతూ, పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలని కోరారు. చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న ఉద్యోగులపై అదనపు పనిభారం మోపడం సమంజసం కాదన్నారు.కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా నెలనెలా వేతనాలు చెల్లించకుండా రెండు, మూడు నెలలకు ఒకసారి జీతాలు ఇవ్వడం వల్ల ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగుల శ్రమకు తగిన వేతనం అందించాలని, పెండింగ్‌లో ఉన్న జీతాలను సకాలంలో చెల్లించాలని, పని భారాన్ని తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రుతమ్మ, ఈరమ్మ, గౌరమ్మ, నాగవేణి, వహీదా, జగ్గిలి లక్ష్మి, బాట లక్ష్మి, సులోచన, అనిత, స్వరూప తదితరులు పాల్గొన్నారు.


