జర్నలిస్టుల నిర్బంధం హేయమైన చర్య..
1 min read
ఏపీడబ్ల్యూజెఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.జి.ప్రసాద్
జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి
దేశ వ్యాప్తంగా మీడియా స్వేచ్ఛ పై జరుగుతున్న దాడిని ఖండించండి.
జర్నలిస్టుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురవాలి..
జర్నలిస్టుల పై నిర్బందాలు,ఆంక్షలు,అక్రమ అరెస్టులను ప్రజాస్వామ్య వాదులు ఖండించాలి
ఏపీడబ్యూజేఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
కర్నూలు, న్యూస్ నేడు: జర్నలిస్టుల నిర్బంధం హేయమైన చర్య అని ఏపీడబ్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టీ.జీ ప్రసాద్ అన్నారు. ఢిల్లీలో జర్నలిస్టులను పోలీసులు నిర్బంధాన్ని ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట జిల్లా అధ్యక్షులు ఎం శివ శంకర్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడబ్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టీ.జీ. ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టుల పట్ల పోలీసులు ఆంక్షలు, పెట్టడాని,నిర్బంధం ప్రదర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జర్నలిస్టుల హక్కులను, మీడియా స్వేచ్ఛను కేంద్ర ప్రభుత్వం పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టుల రక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. నిర్బంధాలు పునరావృత్తమైతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. జర్నలిస్టులు తమ విధులను స్వేచ్ఛగా, నిర్భయంగా నిర్వహించేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వలపై ఉందన్నారు. జిల్లా గౌరవ అధ్యక్షులు గుడిసె శివన్న మాట్లాడుతూజర్నలిస్టుల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించేలా సంబంధిత అధికారులకు తగిన సూచనలు ఇవ్వాలని, విధి నిర్వహణలో మీడియా ప్రతినిధుల హక్కులకు భంగం కలగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.యు.వినయ్ కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి డి చంద్రమోహన్, నగర కార్యదర్శి ఎర్రమల,జిల్లా సహాయ కార్యదర్శులు పి జయరాజు, ఉరుకుందు, ప్రచార కార్యదర్శి గోపాలకృష్ణ,ఎస్.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షులు శీను,డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా సంఘీభావం ప్రకటించారు. జిల్లా కమిటీ సభ్యులు రామాంజనేయులు, ఏపీడబ్ల్యూజెఎఫ్, ఏపిబీజేఏ జిల్లా నాయకులు ఖలీల్, చెన్నయ్య, అనిల్, రాజు, హరి, శ్రీనాథ్ రెడ్డి, మధు, బాబు, రమేష్,జిలానీ,షేక్షా,మద్దిలేటి,అశోక్, బాబి తదితరులు పాల్గొన్నారు.


