మిషన్ వాత్సల్య స్కీమ్ స్పాన్సర్షిప్ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి
1 min read
– జిల్లా బాలల సంరక్షణ అధికారి స్వప్న ప్రియదర్శిని
కర్నూలు, న్యూస్ నేడు: ఐసిడిఎస్,ఆత్మకూరు ప్రాజెక్టు పరిధిలోని బండి ఆత్మకూరు,వెలుగోడు, ఆత్మకూరు మండలాల మిషన్ వాత్సల్య స్కీం స్పాన్సర్షిప్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం ఐసిడిఎస్ ఆత్మకూరు ప్రాజెక్ట్ ఆఫీసులో సిడిపిఓ కోటేశ్వరమ్మ అధ్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి స్వప్న ప్రియదర్శిని మాట్లాడుతూ మిషన్ వాత్సల్య స్కీం స్పాన్సర్షిప్ పథకం అనేది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త పథకమని లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని విద్య పరంగా ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. సిడిపిఓ కోటేశ్వరమ్మ మాట్లాడుతూ ముఖ్యంగా బాలికలు చదువు మరియు ఇతర రంగాలలో రాణించాలని, ముఖ్యంగా చిన్న వయసులో పెళ్లిళ్లు చేసుకోకూడదని అలా ఎక్కడైనా జరుగుతుంటే 1098 చైల్డ్ హెల్ప్ లైన్ కి కాల్ చేసి తెలపగలరని కోరారు. సంరక్షణ అధికారి దర్గయ్య మాట్లాడుతూ ఈ పథకం తల్లిదండ్రులను కోల్పోయిన, తల్లిదండ్రులు లేదా పిల్లలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి చాలా ఉపయోగకరమని కావున ఈ పథకాన్ని దుర్వినియోగం చేసుకోకుండా జీవితంలో అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవాలని సూచించారు. చివరగా లబ్ధిదారులు మాట్లాడుతూ మాకు ఈ పథకం వల్ల విద్య మరియు ఆరోగ్యపరంగా చాలా ఉపయోగపడుతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ బండి ఆత్మకూర్ వెలుగోడు ఆత్మకూరు మండలాల సూపర్వైజర్లు, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది మరియు అంగన్వాడి వర్కర్లు పాల్గొనడం జరిగింది.


