NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హైకోర్టు ఆదేశాలున్నా వంట ఏజెన్సీకి అనుమతి ఏదీ?

1 min read

హొళగుంద పాఠశాల మధ్యాహ్న భోజన నిర్వహణపై రిజ్వానా నిరసన

ఎంఈఓ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులతో ఆందోళన

జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి

హోళగుంద న్యూస్ నేడు: హొళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం వంట ఏజెన్సీ నిర్వహణకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, తనకు అనుమతి కల్పించడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని మదీనా చుడో లక్ష్మి గ్రూపు అధ్యక్షురాలు, వంట ఏజెన్సీ నిర్వాహకురాలు డి.ఎస్. రిజ్వానా ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి హొళగుంద ఎంఈఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. న్యాయస్థానం ఆదేశాలను గౌరవించి తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు.

ఏళ్లుగా విద్యార్థులకు భోజనం అందించాం

హొళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తమ మదీనా చుడో లక్ష్మి గ్రూపు ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాలుగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు భోజనం తయారు చేసి అందించామని రిజ్వానా తెలిపారు. కొన్ని అనివార్య కారణాలతో త్రిసభ్య కమిటీ ఆదేశాల మేరకు వంట పనులను నిలిపివేశామని పేర్కొన్నారు. అనంతరం అధికారులు నోటీసులు జారీ చేసి వంట చేయకుండా అడ్డుకోవడంతో న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు వివరించారు.

ఆదేశాలున్నా అనుమతి ఇవ్వకపోవడంపై ఆవేదన

ఈ నెల 5వ తేదీ నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహించుకునేందుకు హైకోర్టు అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చిందని రిజ్వానా తెలిపారు. సెలవుల కారణంగా తరువాత అనుమతి ఇస్తామని చెప్పిన అధికారులు ప్రస్తుతం జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం ఎంఈఓ-1 సుధారాణి, ఎంఈఓ-2 కబీర్‌లను కలిసి వంట ఏజెన్సీ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో నిరసనకు దిగినట్లు వెల్లడించారు.

మైనారిటీ మహిళననే కారణంతో నిర్లక్ష్యం చేస్తున్నారా?

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించిన తమ ఏజెన్సీని ఏకపక్షంగా తొలగించారని రిజ్వానా ఆరోపించారు. దీనివల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మైనారిటీ మహిళననే కారణంతో తనను చిన్నచూపు చూస్తున్నారా? అని ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వంట ఏజెన్సీ నిర్వహణకు అనుమతి ఇవ్వకపోవడం ఏమిటని నిలదీశారు. అనుమతి కల్పిస్తామని చెప్పిన త్రిసభ్య కమిటీ సభ్యులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.

పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) ద్వారా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ తన సమస్య పరిష్కారం కాలేదని రిజ్వానా తెలిపారు. సంబంధిత అధికారులు, త్రిసభ్య కమిటీ సభ్యులు స్పందించడం లేదని ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న అధికారుల వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

కలెక్టర్ జోక్యంతో సమస్య పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి, ఉప విద్యాశాఖ అధికారి వెంటనే స్పందించి హొళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తమ మదీనా చుడో లక్ష్మి గ్రూపునకు వంట ఏజెన్సీ నిర్వహణకు అనుమతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని రిజ్వానా విజ్ఞప్తి చేశారు. న్యాయం జరగకపోతే మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పాటు గ్రూపు సభ్యులతో కలిసి ప్రజా ఉద్యమం చేపడతామని తెలిపారు.హైకోర్టు ఆదేశాల ప్రతిని చేతబట్టి కుటుంబ సభ్యులతో కలిసి ఎంఈఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన రిజ్వానా, తమ సమస్యను ఉన్నతాధికారులు తక్షణమే పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *