కమనీయం శ్రీ మఠంలో చిన్నారుల భరతనాట్యం
1 min read
భక్తులను ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
కళాకారులను ఆశీర్వదించిన శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు
మంత్రాలయం న్యూస్ నేడు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో నాద నయన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కర్నాటక రాష్ట్రం బళ్ళారి భారతి నాట్య కళా కేంద్ర కళాకారులు యజ్ఞ మండపం లో ప్రదర్శించిన చిన్నారుల భరతనాట్య ప్రదర్శనలు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. బుధవారం కళా కేంద్ర నిర్వాహకురాలు వైష్ణవి మధుసూదన్ ఆధ్వర్యంలో కళాకారులు లయబద్ధమైన అడుగులు, అద్భుతమైన భారత నాట్య ప్రదర్శన చేపట్టారు. శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామీజీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాల ఇన్చార్జ్ గా వ్యవహరించిన పద్మనాభ స్వామి పర్యవేక్షణలో ప్రదర్శనలు విజయవంతంగా కొనసాగాయి. ఈ కార్యక్రమానంతరం శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ కళాకారులను శాలువాలతో సత్కరించి, ఫల మంత్రాక్షతలు అందించి విశేషంగా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ, “మంత్ర మహిమాన్వితమైన మంత్రాలయ క్షేత్రంలో, సాక్షాత్తు గురు రాఘవేంద్రుల సన్నిధిలో నృత్య సేవ చేసుకునే భాగ్యం కలగడం మా జన్మ ధన్యం అని తెలిపారు. ప్రదర్శనలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళాకారులను అభినందించారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా భారతీయ కళలను, భక్తి, సంస్కృతిని భావితరాలకు అందించడం మఠం లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భరత నాట్య కళాకారిణి లు కీర్తన, అమృత, పావని,నూతన,రేఖ,మన్విత, సమృద్ది తదితరులు పాల్గొన్నారు.


