NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జులై 9 సమ్మెను విజయవంతం చేయండి

1 min read

కార్మిక సంఘాల పిలుపు

విజయవాడ   , న్యూస్​ నేడు:  జులై 9వ తేదీన  దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను విజయవంతం చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర కార్మిక సంఘాల నాయకుల సమావేశం శుక్రవారం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన నూతన మార్కెట్ విధానానికి వ్యతిరేకంగా ఈ సమ్మె నిర్వహిస్తున్నమన్నారు. సుప్రీం కోర్ట్ ఆదేశానుసారం  అసంఘటితరంగ కార్మికుల కనీస వేతనం 26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని విపక్షాలను కూడా కలుపుకోవాలని, సమ్మె విజయవంతం చేసేందుకు, అవసరమైతే బంధు రూపం తీసుకోవాలని నాయకులు నిర్ణయించారు. అన్ని రంగాల్లోని కార్మికుల యాజమాన్యాలకు సమ్మె నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చెప్పిందే తడువుగా డబల్ ఇంజన్ సర్కార్ గా చెబుతున్న రాష్ట్ర కూటమి ప్రభుత్వం  ఉద్యోగుల, కార్మికుల పని గంటలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం సబబు కాదన్నారు. 8 గంటల పని విధానం కార్మికుల పోరాటాల ఫలితమని ప్రభుత్వానికి గుర్తు చేశారు. యాజ మాన్యాలకు సంపద సృష్టించాలనే పేరుతో 10 గంటలు పని పెంచడం, అధిక గంటల పని చేయాలని నిర్ణయం చేయటం, మహిళలు కూడా రాత్రులు విధులు నిర్వహించవచ్చని నిర్ణయాలు చేయటం  ఎవరికి ప్రయోజనమని ప్రశ్నించారు. కార్మికులను ఉద్యోగులను వెట్టి చాకిరి విధానంలోకి  తీసుకు వెళ్ళటమేనన్నారు. ఏఐటీయూసీ డిప్యూటీ కార్యదర్శి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఒకరకంగా చెప్పి, ఎన్నికల ముగిశాక బోడి మల్లయ్య అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి హామీ ఇచ్చి నేడు తిలోదకాలు ఇచ్చారన్నారు. అన్ని రంగాలలోనూ హామీలను అమలు చేయని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన కార్మిక చట్టాలను అమలు చేయాలన్నారు. ఐ ఎఫ్ టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే పోలారి మాట్లాడుతూ దేశ వ్యాప్త సమ్మెకు రాష్ట్రంలో అన్ని విపక్ష రాజకీయ పార్టీలు కలుపుకొని బంధు రూపం తీసుకోవాలని కోరారు. కార్మికులు సమ్మె చేయడమే కాకుండా నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఏఐఎఫ్టీయూ(న్యూ) రాష్ట్ర కార్యదర్శి జాస్తి కిషోర్ బాబు మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలాగా సమ్మె విజయవంతం చేయాలని కోరారు. సమ్మె ద్వారా కార్మికుల సత్తా చాటాలని, కార్మిక లోకానికి  విజ్ఞప్తి చేశారు. సిఐటియు రాష్ట్ర నాయకులు వెంకట సుబ్బరావమ్మ మాట్లాడుతూ పట్ట పగలే మహిళలకు రక్షణ కరువైందని, అలాంటి మహిళలకు రాత్రులు విధులు వేస్తే ఎలా రక్షణ కల్పిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆశ అంగన్వాడి లాంటి స్కీం వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగుల పేరుతో తల్లికి వందనం ఎగ్గొట్టారని, షరతుల పేరుతో, 12 వేల ఆదాయం లోపు వారి పేరుతో  అందరికీ పథకాల వర్తింప చేయకపోవడం హామీలను విస్మరించడమేనని విమర్శించారు. కూటమి పార్టీలు ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో అన్ని రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు రైతు సంఘాలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో టియుసిఐ రాష్ట్ర అధ్యక్షులు మరీదు ప్రసాద్ బాబు, హెచ్ఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు త్రినాథ్ కుమార్, ఏఐటీయూసీ నగర కార్యదర్శి మూలి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

About Author