మూసుకుపోయిన శ్వాసనాళానికి స్టెంట్‌తో అరుదైన చికిత్స
1 min read

రాయలసీమలో తొలిసారిగా కర్నూలు కిమ్స్‌లో ఏర్పాటు
75 ఏళ్ల వృద్ధురాలికి మళ్లీ ఊపిరిపోసిన వైద్యులు
కర్నూలు, న్యూస్ నేడు: అన్నవాహిక క్యాన్సర్‌తో బాధపడుతూ.. శ్వాసనాళం 75%కు పైగా మూసుకుపోయిన వృద్ధురాలికి కర్నూలు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు అత్యంత అరుదైన చికిత్స చేసి, ఆమెకు మళ్లీ ఊపిరిపోశారు. ఆమె సమస్యను, అందించిన చికిత్స వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ యశోవర్ధన్ మంగిశెట్టి మరియు కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డా. పి.వి. చలమయ్య, విలేఖరులకు తెలిపారు. “కర్నూలు ప్రాంతానికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు అప్పటికే అన్నవాహిక క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. దానికితోడు ఆమెకు శ్వాసనాళం కూడా 75%కు పైగా క్యాన్సర్ కారణంగా మూసుకుపోయింది. దాంతో ఆమె కనీసం ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితికి చేరుకున్నారు. దాదాపు అత్యవసర పరిస్థితికి చేరుకున్న ఆమె.. కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చారు. ఆమె పరిస్థితిని గమనించిన వైద్య బృందం వెంటనే ఆమెకు రిజిడ్ బ్రాంకోస్కొపీ ద్వారా మెటాలిక్ స్టెంట్ (సెమ్స్) అమర్చాలని నిర్ణయించింది. సి-ఆర్మ్ సహాయంతో అత్యంత కచ్చితమైన స్థానంలో ఆ స్టెంట్‌ను అమర్చాం. దీంతో ఆ వృద్ధురాలి శ్వాసనాళం పూర్తిగా తెరుచుకుని, శ్వాస ఆడడం మొదలైంది. శస్త్రచికిత్స అవసరం లేకుండానే కేవలం స్టెంటింగ్ ద్వారానే ఆమె సమస్యను చాలావరకు నయం చేశాం. రాయలసీమలో ఇదే మొట్టమొదటి సారి సెమ్స్ స్టెంట్ అమరిక ప్రక్రియ కావడం విశేషం. ఇంటర్వెన్‌షనల్ పల్మనాలజీకి సంబంధించి ఉన్నవాటిలో అత్యంత సంక్లిష్టమైన కేసుల్లో ఇదొకటి. శ్వాసనాళానికి ఉన్న తీవ్రమైన అడ్డంకిని శస్త్రచికిత్స అవసరం లేకుండానే తొలగించి.. ఆ వృద్ధురాలికి ఇబ్బంది లేకుండా చేయగలిగాం. ఇలాంటి అధునాతన చికిత్సలు ఇప్పటి వరకు హైదరాబాద్ లేదా బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు రాయలసీమ ప్రాంత వాసుల కోసం కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో కూడా అందుబాటులోకి వచ్చాయి” అని ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ యశోవర్ధన్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ వెంకట చలమయ్య తెలిపారు.

