కీటక జనిత వ్యాధులపై అవగాహన..
1 min read

జిల్లా మలేరియా అధికారి మనోరమ
చెన్నూరు ,న్యూస్ నేడు : గ్రామీణ ప్రాంత ప్రజలు కీటక జనిత వ్యాధులపై అదేవిధంగా వర్షాకాలంలో వచ్చే సీజన్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిన వెంటనే స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని జిల్లా మలేరియా అధికారి మనోరమ, రూరల్ హెల్త్ ట్రైనింగ్ వైద్యాధికారి డాక్టర్ సాయి చందన అన్నారు. ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ నాగరాజు ఆదేశాల మేరకు జిల్లా మలేరియా అధికారి మనోరమ ఆధ్వర్యంలో చెన్నూరు సచివాలయం-3 పరిధిలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం( సిహెచ్ సి) నందు అలాగే కే ఓ ఆర్ కాలనీ నందు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజలను సిహెచ్ సి లో సమావేశపరిచి డాక్టర్ సాయి చందన కీటక జనిత వ్యాధులు, ఫ్రైడే డ్రై డే ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేశారు. అలాగే కాలంలో వచ్చే సీజన్ వ్యాధులు చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్, మెదడువాపు, వంటి జబ్బులే కాకుండా బోదకాలు వంటి ప్రబలే అవకాశం ఉందన్నారు. వీటిపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ, వాటి నివారణ గురించి తెలియజేశారు. సబ్ యూనిట్ అధికారి మురళీధర్ మాట్లాడుతూ, గ్రామాల్లోని ప్రజలు ముఖ్యంగా తమ ఇంటి పరిసరాల చుట్టూ నీరు నిలువ లేకుండా చూడాలని తెలిపారు. ఇంటి పరిసరాలలో వ్యర్ధాలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. అలాగే ఇంటి వద్ద ఉన్న నీటి తొట్లు, ట్యాంకుల పైన, సంపుల పైన మూతలు అమర్చుకోవాలన్నారు. తెరిచి ఉండడంతో దోమలు అక్కడ చేరి మరింత వ్యాప్తి అవకాశం ఎక్కువగా ఉందని ఇలాంటి వాటిపై ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన తెలియజేశారు. అలాగే కె.ఓ.ఆర్ కాలనీ యందు ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, కలిసి లార్వా సర్వే, ఫీవర్ సర్వే నిర్వహించి ప్రజలకు కీటక జనిత వ్యాధులపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిహెచ్ సి వైద్యాధికారి డాక్టర్ సతీష్, హోమియోపతి,అల్లోపతి ఎం పి హెచ్ ఈ ఓ వెంకటరమణ, రెడ్డమ్మ, ఎం పి హెచ్ ఎస్. షణ్ముగం, మోహన్ రెడ్డి, ఎం పి హెచ్ ఎ చెన్నయ్య, ఏఎన్ఎం నర్మద, ఆశా కార్యకర్తలు రజిని,సుమలత, శాంతి, చిన్నక్క, తదితరులు పాల్గొన్నారు.


