మమ్మల్ని విడిచి వెళ్లొద్దు పంతులమ్మ..
1 min read

బదిలీపై వెళ్తున్న కళ్యాణి మేడం ను వేడుకుంటున్న బడి పిల్లలు.
పత్తికొండ, న్యూస్ నేడు: విద్యార్థులకు అన్ని తానై విద్యాబుద్ధులతో పాటు ఆలనా పాలన చూసుకుంటూ, వారి ఉన్నతికి తోడ్పడుతూ, బదిలీపై వెళ్తున్న కళ్యాణి మేడం ను తమను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దని దీనాతి దీనంగా వేడుకుంటున్న ఆ పాఠశాల బడి పిల్లల వైనం అందరిని ఆశ్చర్యపరిచింది. గత ఏడు సంవత్సరాలుగా పత్తికొండ మండలంలోని జేఎం తాండ ప్రాథమిక పాఠశాలలో ఎంతో నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న కళ్యాణి కుమారి ఇటీవల బదిలీ చేశారు. కళ్యాణి కుమారి మేడం బదిలీని జీర్ణించుకోలేక విద్యార్థులందరూ తమను వదిలి వెళ్ళొద్దని ఏడ్చుకుంటూ కన్నీళ్ళ పర్యంతమయ్యారు. ఆరుగురు విద్యార్థులతో నడుస్తున్న పాఠశాల నేడు 50 మంది పిల్లలతో అలరారుతుంది. బడి బయట పిల్లలందరినీ బడికి వచ్చేలా తల్లిదండ్రులను ఒప్పించి, అనతి కాలంలోనే పాఠశాల విద్యార్థులతో నిండిపోయేలా చేసిన ఘనత కళ్యాణి మేడంకే దక్కింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆ పాఠశాల నుండి కళ్యాణి కుమారి మేడం ను మండలంలోని పుచ్చకాయల మాడ గ్రామానికి బదిలీ చేశారు. తమ పాఠశాల నుండి కళ్యాణి కుమారి మేడం వెళ్ళిపోతుందనే బాధతో విద్యార్థులందరూ ఆమె దగ్గరకు చేరి తమను వదిలి వేరే చోటకు వెళ్ళద్దని, తమ పాఠశాలలోనే ఉండాలని విద్యార్థులందరూ ఆమెను వేడుకున్నారు. కానీ బదిలీల్లో భాగంగా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తుందని విద్యార్థులకు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. తల్లిదండ్రులు సైతం కళ్యాణి కుమారి మేడంను బదిలీ చేయకుండా తమ పాఠశాలలోనే ఉంచాలని ఆందోళనలు చేపట్టారు. కళ్యాణి కుమారి మేడం కూడా ఇంతకాలం పిల్లలతో ఉన్న చనువు రీత్యా అక్కడే ఉండాలని కోరుకుంటుంది. కాబట్టి విద్యాధికారులు పరిస్థితిని అర్థం చేసుకొని కళ్యాణి కుమారి మేడం బదిలీ ఆపాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

