NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్లోమానికి చిన్నపేగు క‌లిపి కుట్టి.. ప్రాణ‌దానం

1 min read

వంశ‌పారంప‌ర్యంగా క్లోమంలో రాళ్లతో దీర్ఘకాలంగా నొప్పి

ఎండోస్కొపీ చికిత్స‌లు చేసినా క‌ల‌గ‌ని ఊర‌ట‌

17 ఏళ్ల యువ‌తికి కిమ్స్ స‌వీరాలో ఫ్రేస్ ప్రొసీజ‌ర్ శ‌స్త్రచికిత్స‌

అనంత‌పురంలో ఈత‌ర‌హా శ‌స్త్రచికిత్స ఇదే తొలిసారి

అనంతపురం, న్యూస్ నేడు : ఇంట‌ర్ చ‌దువుతున్న 17 ఏళ్ల యువ‌తికి చిన్నత‌నం నుంచి ప‌దేప‌దే క‌డుపునొప్పి వ‌స్తుండేది. ఆమెను హైద‌రాబాద్‌లోని పెద్ద ఆస్పత్రిలో చూపించ‌గా చాలా అరుదైన వంశ‌పారంప‌ర్య పాంక్రియాటైటిస్ అనే స‌మ‌స్య ఉంద‌ని తేలింది. అంటే ఆమె క్లోమం (పాంక్రియాస్‌)లో రాళ్లు ఏర్పడ్డాయి. దానికి ప‌లుమార్లు ఎండోస్కొపీ చికిత్సలు చేసినా, తాత్కాలికంగా ఒక నెల రోజులు ఊర‌ట ల‌భించి మ‌ళ్లీ నొప్పి మొద‌ల‌య్యేది. మందులు వాడినా ఉప‌యోగం లేక‌పోవ‌డంతో ఆ యువ‌తిని అనంత‌పురంలోని కిమ్స్ స‌వీరా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ ఆ యువ‌తిని ప‌రీక్షించి, సంక్లిష్టమైన ఫ్రేస్ ప్రొసీజ‌ర్ అనే శ‌స్త్రచికిత్స చేసిన క‌న్సల్టెంట్ స‌ర్జిక‌ల్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్ట్ డాక్టర్ ఎన్. మ‌హ్మద్ షాహిద్ ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను తెలిపారు. “అక్షయ అనే ఆ యువ‌తికి ప‌దేప‌దే క‌డుపునొప్పి వ‌స్తుండ‌డం, స్టెంట్ వేసినా ఒక నెల‌రోజులు ఆగి త‌ర్వాత మ‌ళ్లీ నొప్పి రావ‌డంతో అప్పుడు కిమ్స్ స‌వీరాకు తీసుకొచ్చారు. ఇక్క‌డ ఆమెను స‌మ‌గ్రంగా ప‌రీక్షిస్తే ఆమె క్లోమంలోని త‌ల‌, శ‌రీరం, తోక‌.. మూడు భాగాల్లోనూ రాళ్లు ఏర్ప‌డుతున్నాయ‌ని తెలిసింది. దాంతో ఆమెకు శ‌స్త్రచికిత్స చేయ‌డం త‌ప్ప మ‌రో మార్గం లేద‌ని నిర్ణయించాం. ఇందుకోసం ఆమెకు అత్యంత సంక్లిష్టమైన‌, అత్యాధునిక‌మైన ఫ్రేస్ లేట‌ర‌ల్ పాంక్రియాటికో జెజునోస్టమీ (ఎల్‌జేపీ) అనే శ‌స్త్రచికిత్స చేశాం. ఇందులో భాగంగా ముందుగా ఆమె క్లోమాన్ని క‌త్తిరించి, అందులో ఉన్న మొత్తం రాళ్ల‌ను తీసేశాం. త‌ర్వాత ఆమె చిన్నపేగులో కొంత భాగాన్ని తీసుకుని, దాన్ని క్లోమంతో క‌లిపి కుట్టాం. దానివ‌ల్ల ఇక మీద‌ట రాళ్లు ఏర్పడినా, అవి ఆ చిన్నపేగు భాగంలోకి వెళ్లిపోతాయి త‌ప్ప క్లోమంలోకి వెళ్లవు. క్లోమ‌ర‌సం పేగుల్లోకి వెళ్లేందుకు ఒక డ‌క్ట్ ఉంటుంది. అందులోకి పెద్ద ప‌రిమాణంలో రాళ్లు చేరితే క్లోమ‌రసం పేగుల్లోకి వెళ్లదు. ఫ‌లితంగా తిన్న ఆహారం జీర్ణం కాదు. క్లోమంలో రాళ్లు ఏర్పడ‌డం అనేది వంశ‌పారంప‌ర్యంగా త‌లెత్తే స‌మ‌స్య‌. ఇది ఎక్కువ‌గా చిన్నపిల్లల్లోనే క‌నిపిస్తుంది. దాంతోపాటు ద‌క్షిణ భార‌త‌దేశంలో ఎక్కువ‌గా ఉంటుంది. కేర‌ళ‌లో దీని సంభావ్య‌త బాగా ఎక్కువ‌. ఆంధ్రప్రదేశ్‌లోని రాయ‌ల‌సీమ ప్రాంతంలోనూ క‌న‌ప‌డుతుంది. ఇందులో దీర్ఘకాలం పాటు నొప్పి ఎక్కువ‌గా ఉందంటే అప్పుడు త‌ప్పక శ‌స్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. జ‌న్యులోపాల వ‌ల్ల ఈ స‌మ‌స్య వ‌స్తుంది. అంత‌ర్జాతీయంగా చూస్తే ప్రతి 3 ల‌క్షల మందిలో ఒక‌రికే వ‌స్తుంది. ఈ స‌మ‌స్య ఉన్నవారిలో నాలుగోవంతు మందికి మ‌ధుమేహం కూడా వ‌స్తుంది. పిల్లల‌కు క‌డుపునొప్పి త‌గ్గకుండా వ‌స్తుంటే త‌ప్పనిస‌రిగా వైద్యుల‌కు చూపించాలి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ లాంటి ప‌రీక్షల‌తో దీన్ని గుర్తించ‌గ‌లం. ప‌దేళ్లలోపే పిల్లల‌ను చూపిస్తే త‌ర్వాతి కాలంలో ముప్పు త‌క్కువ ఉంటుంది. ఒక‌సార ఫ్రేజ్ ప్రొసీజ‌ర్ చేయిస్తే, ఇక జీవిత‌కాలంలో వాళ్లకు ఈ స‌మ‌స్య మ‌ళ్లీ రాదు” అని డాక్టర్ మ‌హ్మద్ షాహిద్ వివ‌రించారు.

About Author