ఉత్పాదకతకు కొత్త నిర్వచనం ఇస్తున్న జెన్ జీ
1 min read

హెచ్ఎంఏ సదస్సులో శ్రీచరణ్ లక్కరాజు
హైదరాబాద్, న్యూస్ నేడు : “జెన్ జీ, పని ప్రదేశంలో ఉత్పాదకత” అనే అంశంపై హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక లెక్చర్ సెషన్ నిర్వహించారు. ఇందులో స్టూడెంట్ ట్రైబ్ వ్యవస్థాపకులు, సీఈఓ శ్రీచరణ్ లక్కరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ఆధునిక ఉద్యోగ వాతావరణంలో జెన్ జీ (యువతరం) తీసుకువస్తున్న మార్పులపై వివరణాత్మకంగా ప్రసంగించారు.జెన్ జీ, ప్రస్తుత డిజిటల్-నేటివ్ తరాలు సంప్రదాయ పర్యవేక్షణ, గట్టి పట్టుదల, పదేపదే చేసే ఒకేలాంటి పనుల కన్నా.. ఒక సరైన ఉద్దేశం, స్వాతంత్య్రంతో కూడిన పనితీరుకు అధిక ప్రాధాన్యం ఇస్తాయని ఆయన వివరించారు. వారి సమర్థత ప్రధానంగా సృజనాత్మకత, స్పష్టమైన అవగాహన, అర్థవంతమైన అనుసంధానం ద్వారా ముందుకు సాగుతోందని తెలిపారు. అందువల్ల యాజమాన్యాల్లో ఉన్నవాళ్లు ఇకపై పర్యవేక్షణకు బదులు కోచ్‌లుగా మారి, ఉద్యోగులకు స్వేచ్ఛ, వెసులుబాటు, విశ్వాసం కల్పించే వాతావరణాన్ని సృష్టిస్తే వారి నిజమైన పనితీరు వెలుగులోకొస్తుందని సూచించారు.జెన్ జీ గురించి సమాజంలో ఉన్న “అసహనం, అలజడి, శ్రద్ధలేమి” లాంటి అభిప్రాయాలు వాస్తవం కాదని ఆయన స్పష్టం చేశారు. జెన్ జీ తరం లోతైన అవగాహన, ఆధ్యాత్మికత, ఆరోగ్య అవగాహన, ప్రభావం ఆధారిత దృక్కోణం కలిగినవారని తెలిపారు. వారు తక్కువ ఉత్పాదకత కలవారు కారని, వేరే విధమైన ఉత్పాదకత చూపిస్తూ, శరవేగంగా ఎదగాలని, అందరితో స్వేచ్ఛగా మాట్లాడాలని భావిస్తారని, అలాగే వ్యక్తిత్వానికి గౌరవం కోరుకుంటూ నిజాయతీతో కూడిన పని సంస్కృతి కావాలనుకుంటారని.. ఇవే జెన్ జీ ప్రధాన ప్రాధాన్యాలని లక్కరాజు వివరించారు. ఈ మార్పులను అర్థం చేసుకొని సంస్థలు తమ విధానాలను మార్చుకుంటే, జెన్ ఏఐ యుగంలో మానవ వనరుల పూర్తి సామర్థ్యాన్ని సంస్థలు వెలికితీయగలవని భావన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా హెచ్ఎంఏ అధ్యక్షుడు అల్వాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, యువతకు సాధికారత కల్పించేందుకు హెచ్ఎంఏ కట్టుబడి ఉందని చెప్పారు. దీనికి ఆంత్రప్రెన్యూరియల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తామని, జెన్ జీ తరం ఆశయాలకు అనుగుణంగా ఇతర చర్యలను రూపొందిస్తామని అన్నారు. యువ వృత్తి నిపుణుల్లో అభివృద్ధి దృక్కోణం, నాయకత్వ గుణాలు, భవిష్యత్తుకు సిద్ధమైన మనస్తత్వం పెంపొందించడంపై హెచ్ఎంఏ దృష్టి పెడుతుందని తెలిపారు.కార్యక్రమ ముగింపులో హెచ్ఎంఏ కార్యదర్శి వాసుదేవన్ జి వచ్చినవారందరికీ ధన్యవాదాలు తెలిపారు. విలువైన ఉపన్యాసం అందించిన లక్కరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. విలువైన మద్దతు, భాగస్వామ్యం అందించినందుకు ఆస్కి (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా)కు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. అనేకమంది ఉత్సావహంతంగా పాల్గొనడం, అర్థవంతమైన చర్చలతో ఈ కార్యక్రమం ముగిసింది. వేగంగా మారుతున్న పనితీరుకు సంస్థలను సిద్ధం చేసే చర్చలకు వేదికగా హెచ్ఎంఏ కీలక పాత్ర పోషిస్తోందని ఈ కార్యక్రమం మరోసారి రుజువు చేసింది.


