డిసెంబర్ 21న జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
1 min read

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయాలి
జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్
కర్నూలు, న్యూస్ నేడు : డిసెంబర్ 21వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా సమన్వయంతో, సమర్థవంతంగా అమలు చేసి, వంద శాతం శిశువులకు పోలియో చుక్కలు వేయాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను సంబంధిత అధికారులతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిసెంబర్ 21వ తేదీన జిల్లాలో మొత్తం 3 లక్షల 52 వేల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి జిల్లావ్యాప్తంగా మొత్తం 1,600 పోలియో బూతులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 1,180 బూతులు, పట్టణ ప్రాంతాల్లో 420 బూతులు, 52 ట్రాన్సిట్ పాయింట్లు, 63 మొబైల్ యూనిట్లు ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. అలాగే డిసెంబర్ 22 మరియు 23 తేదీలలో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయడానికి 5 లక్షల 14 వేల ఇళ్లను లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు.. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖతో పాటు ఐసిడిఎస్, మున్సిపల్, పంచాయితీ రాజ్, రెవెన్యూ, విద్యా శాఖల మధ్య సమన్వయం అత్యంత అవసరమని స్పష్టం చేశారు. గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించి పోలియో చుక్కల పంపిణీ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలను మరింత ఉధృతం చేయాలని, ఫ్లెక్సీలు, పోస్టర్లు, మైక్ ప్రచారం, మీడియా ద్వారా సమాచారాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, డిఎంహెచ్వో డాక్టర్ ఎం భాస్కర్, డి.ఐ.ఓ డాక్టర్ ఉమ, తదితరులు పాల్గొన్నారు.

