31 న ఇంటివద్దకే…. పెన్షన్లు
1 min read

పంపిణీ సందర్భంగా పెన్షన్ దారుల నుండి ఎలాంటి ఫిర్యాదులు రాకూడదు
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు : డిసెంబర్ 31 వ తేదీన పింఛనుదారుల ఇంటివద్దకే వెళ్ళి పెన్షన్లను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.ఆదివారం ఎంపిడిఓ లు, మునిసిపల్ కమిషనర్లు, పెన్షన్ పంపిణీ అధికారులతో జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జనవరి ఒకటవ తేదీన పంపిణీ చేయవలసిన పెన్షన్లను డిసెంబర్ 31 వ తేదీనే పింఛనుదారులకు పంపిణీ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ లో భాగంగా ఐవిఆర్ఎస్ ద్వారా పెన్షన్ పంపిణీ పై పెన్షన్ దారుల నుండి అభిప్రాయ సేకరణ జరుగుతోందని, ఈ సందర్భంగా పెన్షన్ దారుల నుండి ఎలాంటి ఫిర్యాదులు రాకూడదని కలెక్టర్ పెన్షన్ పంపిణీ అధికారులను ఆదేశించారు. పెన్షన్ దారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, పెన్షన్ పంపిణీ చేసే సమయంలో డబ్బులు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు రాకూడదని, ఇంటికే వెళ్ళి పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎంపిడిఓ, మునిసిపల్ కమిషనర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి, పెన్షన్ పంపిణీ సజావుగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే హౌసింగ్ లబ్దిదారులకు స్టేజ్ వారీగా ప్రభుత్వం చెల్లిస్తున్న డబ్బు ఎప్పుడెప్పుడు ఏ బ్యాంకు, అకౌంట్ లో పడిందో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు లబ్ధిదారులకు వివరించాలని కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా సంక్షేమ శాఖలు, ఇతర శాఖలకు కూడా ఐవిఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ జరుగుతున్నందున ఆయా శాఖలు ఫిర్యాదులకు అవకాశం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.టెలి కాన్ఫరెన్స్ లో డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమణా రెడ్డి, జడ్పీ సీఈవో నాసర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

