రేషన్ సరుకులను ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా సక్రమంగా పంపిణీ చేయాలి
1 min read
65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ సరుకులను అందచేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి
హోళగుందన్యూస్ నేడు: రేషన్ షాపుల ద్వారా సరుకులను ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా సక్రమంగా పంపిణీ చేయాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆదేశించారు.మంగళవారం హోళగుంద మండల కేంద్రంలో ప్రభుత్వ చౌక ధరల దుకాణం 03 ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రేషన్ సరుకుల పంపిణీ ప్రక్రియ, స్టాక్ వివరాలు, ఈ–పాస్ యంత్రాల వినియోగం, కార్డుదారుల హాజరు నమోదు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. అర్హులైన ప్రతి కార్డుదారుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తి స్థాయిలో నాణ్యమైన నిత్యావసర సరుకులు అందించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. రేషన్ దుకాణాల్లో పారదర్శకతను పాటిస్తూ, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పంపిణీ జరగాలని డీలర్ ను ఆదేశించారు. అనంతరం 65 సంవత్సరాలు ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న హోమ్ డెలివరీ ప్రక్రియను పరిశీలించారు.. ప్రతినెల నిర్దేశించిన తేదీల్లో హోమ్ డెలివరీ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వృద్ధులు, దివ్యాంగులకు హోమ్ డెలివరీ విధానం సమర్థవంతంగా అమలు చేయాలని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.అనంతరం కలెక్టర్ 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు బసమ్మ, మీనాక్షమ్మ లకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ సరుకులు అందచేశారు. ప్రభుత్వం అందజేస్తున్న సేవలు గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి రాజా రఘువీర్, ఆదోని సబ్ కలెక్టర్ (ఇంచార్జి) అజయ్ కుమార్, తహసీల్దార్ నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


