NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పదవ తరగతి లో ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యార్ధులు కష్టపడి చదవాలి

1 min read

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

హోళగుంద న్యూస్ నేడు : పదవ తరగతిలో ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యార్థులు కష్టపడి చదవాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి విద్యార్థులకు సూచించారు.మంగళవారం హోళగుంద మండలం ఎల్లార్తి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (కన్నడ మాధ్యమం)ను,  హోళగుంద మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లోని పదవ తరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉందని, ఎక్కువ సమయం చదువు కు కేటాయించి, కష్టపడి బాగా చదువుకోవాలన్నారు..10 వ తరగతి పబ్లిక్ పరీక్షలలో  ప్రతి ఒక్క విద్యార్థికి 85 శాతం పైగా మార్కులు వచ్చే విధంగా దృష్టి పెట్టాలన్నారు..ప్రతి రోజు నిర్వహించే యూనిట్ టెస్ట్ కోసం బాగా చదివితే, పబ్లిక్ పరీక్షలకు కచ్చితంగా ఉపయోగపడుతుందని ప్రోత్సహించారు. ఈ టెస్ట్ లో  20 మార్కులకు  15 మార్కులు పైగా తెచ్చుకోవాలని సూచించారు.  సబ్జెక్ట్ పరంగా ఏ విధంగా చదివితే మార్కులు బాగా వస్తాయనే దాని మీద కలెక్టర్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. సి, డి గ్రేడ్ విద్యార్థుల పై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ హెడ్ మాస్టర్ ను ఆదేశించారు..ఉపాధ్యాయులు పాఠాలు ఏ విధంగా చెప్తున్నారు, భోజనం రుచిగా ఉంటుందా, భోజనం సరిపోయినంత పెడుతున్నారా అని కలెక్టర్ విద్యార్థులను ఆరా తీశారు. కలెక్టర్ ముందుగా ఎల్లార్తి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (కన్నడ మాధ్యమం) పాఠశాలను తనిఖీ చేశారు..పరిసర ప్రాంతాలను పరిశీలిస్తూ పాఠశాల ఆవరణను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ ఉపాధ్యాయులను ఆదేశించారు.. పరిశుభ్రమైన వాతావరణం వల్ల  విద్యార్థులు ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఏకాగ్రతతో చదవగలుగుతారని కలెక్టర్ సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనం నాణ్యత, వంటశాల పరిశుభ్రతను పరిశీలిస్తూ భోజనం బాగుందని, వంటశాలను శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.. విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన పోషకాహారం అందించాలని కలెక్టర్ హెడ్ మాస్టర్ ను ఆదేశించారు.కార్యక్రమంలో డిఇఓ జి. సుధాకర్, సమగ్ర శిక్ష ఏపీసీ లోక రాజ్, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజా రఘువీర్, హోళగుంద ఇంచార్జి తహసిల్దార్ నిజాముద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

About Author