స్త్రీ విద్యకోసం అలుపెరగని కృషిచేసిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: స్త్రీ విద్యకోసం అలుపెరగని కృషిచేసిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే అని రాయలసీమ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సులర్ ఆచార్య వి. వెంకట బసవరావు కొనియాడారు. యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం వారి ఆధ్వర్యంలో ఈరోజు సావిత్రీబాయిపూలే జయంతి సందర్భంగా సెనేట్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన విశ్వవిద్యాలయ అధికారులతో కలిసి ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. భారతీయ సమాజంలో పరివర్తనకోసం అలుపెరగని కృషిచేసిన సంఘసంస్కర్తలుగా పూలే దంపతులు నిలుస్తారన్నారు. చదువుకున్న మహిళ కుటంబంతోపాటు సమాజాన్ని సక్రమంగా నిర్వహించగలదన్న ప్రగాఢ విశ్వాసంతో సావిత్రీబాయి తన భర్త జ్యోతీబా పూలేతో కలిసి కృషిచేశారని ఆచార్య బసవరావు వివరించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికోసం పూలేదంపతులు చేసినకృషి అసామాన్యమని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయకుమార్ నాయుడు నివాళులర్పించారు. కుల మత ప్రాంతీయ విభేదాలతోపాటు లింగవివక్షకు తావులేకుండా ప్రతిఒక్కరూ ఎదగడానికి సమానావకాశాలు ఉండాలని ఆశించిన ఆ జంట దేశచరిత్రలో తమకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య పి.వి. సుందరానంద్ కొనియాడారు. మహిళావిద్య అనగానే గుర్తుకువచ్చే సావిత్రీబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా చెప్పుకోవడం సమంజసమని వర్సిటీ IQAC డైరెక్టర్ ఆచార్య ఆర్. భరత్ కుమార్ అభిప్రాయపడ్డారు. అణగారిన వర్గాల అభ్యున్నతితోపాటు స్త్రీ విద్యకోసం కృషిచేసిన సావిత్రీబాయి పూలే సేవలు అనన్య సామాన్యమని వర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పి. నాగరాజు కీర్తించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ కె. వెంకటరత్నం, డాక్టర్ బి. విజయుడు, డాక్టర్ నాగచంద్రుడు, శివప్రసాదరెడ్డితోపాటు వివిధ విభాగాల ఆచార్యులు, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

