స్కానింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టాలి
1 min read

ఫిర్యాదులను 18004256131 ఫోన్ చేయాలి
పిసి అండ్ పి.ఎన్.డి.టి.యాక్ట్ అమలుపై అంతరాష్ట్ర సరిహద్దు జిల్లాల సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్
కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: గర్భస్థ పిండ లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ కేంద్రాలపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని గౌతమీ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన పిసి అండ్ పి.ఎన్.డి.టి. యాక్ట్ అమలుపై అంతరాష్ట్ర సరిహద్దు జిల్లాల సమన్వయ కమిటీ సమావేశంలో అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని, వాటిని నిరోధించేందుకు మరింత నిఘా పెంచడంతోపాటు, పెద్ద ఎత్తున డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.అంతరాష్ట్ర సరిహద్దు మండలాల అధికారులతో సబ్ కమిటీ ఏర్పాటుచేసి, ఏ ప్రాంతం నుండి అబార్షన్ కు సంబంధించి కేసులు నమోదవుతున్నాయో పరిశీలించి ఆయా స్కానింగ్ కేంద్రం వారి వివరాలు సేకరించాలని అన్నారు.ఎక్కడైనా ఆయా కేసుల పై అనుమానం వ్యక్తమైతే అందుకు సంబంధించిన సమాచారం రికార్డు చేసుకోవాలని, 18004256131 టోల్ ఫ్రీ ఫోన్ చేసి ప్రజలు ఫిర్యాదు చేసేలా ప్రజలలో అవగాహన కలిగించాలన్నారు. డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించి ఎవరైనా లింగనిర్ధారణ పరీక్షలకు పాల్పడినట్లు గుర్తించినట్లయితే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు.తనిఖీలు నిర్వహించే బృందానికి తమ పూర్తి సహకారం ఉంటుందన్నారు. వాటిల్లో నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రుజువైతే వెంటనే సదరు స్కానింగ్ కేంద్రాల నిర్వహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, డాక్టర్ల లైసెన్స్ రద్దుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇద్దరు ఆడపిల్లలను కలిగి ఇంకా మూడవ కాన్పు కోసం ఎదురు చూసే వారి పై దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా:పి.జె.అమృతం, డెమో శ్రీనివాసరావు, ఐసిడిఎస్ పీడీ శారద, భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి చైతన్య, అంతరాష్ట్ర సరిహద్దు ప్రాంతాల ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యాధికారులు, ప్రభృతులు పాల్గొన్నారు.


