కాకినాడలో కోరమాండల్ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి లోకేష్
1 min read

కాకినాడ, న్యూస్ నేడు కాకినాడ రూరల్ వలసపాకల బీచ్ రోడ్డులో కోరమాండల్ ఆసుపత్రి నూతన భవనాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ముందుగా ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం 60 పడకల ఇంటిగ్రేటెడ్ కోరమాండల్ హాస్పటల్ నూతన భవనాన్ని రిబ్బన్ కట్ చేసి మంత్రి ప్రారంభించారు. ఆసుపత్రి భవనం మొత్తం కలియతిరిగి వసతులను పరిశీలించారు. కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద కోరమాండల్ సంస్థ గత కొన్నేళ్లుగా అవుట్ పేషంట్ హాస్పిటల్ ను నిర్వహిస్తోంది. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల నుంచి ఏడాదికి 1.2 లక్షల మందికి పైగా రోగులకు సేవలందించడం జరుగుతోంది. మొదటి దశలో ఆసుపత్రి అభివృద్ధికి రూ.8 కోట్లు వెచ్చించారు. రెండో దశలో ప్రస్తుతం రూ.32 కోట్లు వెచ్చించి ఇన్ పేషంట్ సదుపాయాలను కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎమ్ఎమ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ఎం.ఏ అలగప్పన్, ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్.శంకరసుబ్రహ్మణ్యన్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అరుణ్ అలగప్పన్, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ డైరెక్టర్ వి.నారాయణన్ తో పాటు ఎంపీ సానా సతీష్, మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం వెంకటేశ్వరరావు, రాజమండ్రి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

