NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా ముగిసిన ఆశ్రమ్ చాలెంజెస్ ట్రోఫీ అంధుల క్రికెట్ టోర్నమెంట్

1 min read

ఆంధ్రప్రదేశ్ జట్టుకు విజేతగా, తెలంగాణ జట్టుకు రన్నరప్ గా బహుమతుల ప్రధానం

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరులోని ఆశ్రమ్ కళాశాల క్రికెట్ మైదానంలో నిర్వహించిన ఆశ్రమ్ చాలెంజెస్ ట్రోఫీ అందుల క్రికెట్ టోర్నమెంట్ ఈ రోజు ఘనంగా ముగిసింది. టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం (క్లోజింగ్ సెరిమనీ)ను నిర్వహించి, మూడు టీ20 మ్యాచ్లలో విజేతగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ జట్టుకు, రన్నరప్ గా నిలిచిన తెలంగాణ జట్టుకు బహుమతులు అందజేశారు. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి, ఏలూరు జిల్లా అజీజ్ హాజరై మాట్లాడుతూ, ప్రభుత్వం తరపున దివ్యాంగ క్రీడాకారులకు ఎల్లప్పుడూ పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ప్రత్యేక అతిథులుగా ఆశ్రమ్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస రాజు, నారా ఫౌండేషన్ చైర్మన్  నారా శేషు, గుప్తా ఫౌండేషన్ చైర్మన్  శ్రీనివాసరావు, క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి జి. రవీంద్రబాబు, అర్జున అవార్డు గ్రహీత ఐ.అజయ్ కుమార్ రెడ్డి పాల్గొని క్రీడాకారులను అభినందించారు.ఈ సందర్భంగా నారా ఫౌండేషన్ చైర్మన్ నారా శేషు  మాట్లాడుతూ, అంధుల క్రికెట్ మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించిన తర్వాత ఎంతో ప్రేరణ పొందామని, అవసరమైనప్పుడు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. గత మూడు రోజులుగా ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ సహకారంతో ఏలూరులో పురుషుల అంధుల క్రికెట్ మ్యాచ్లను విజయవంతంగా నిర్వహించామని వివరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ జట్టు ఇప్పటి వరకు ఏడు జాతీయ టోర్నమెంట్లు జరగగా, ఐదు సార్లు జాతీయ ఛాంపియన్ గా నిలిచిందని, ఈ ఏడాది కూడా అదే స్థాయి ప్రదర్శన కొనసాగిస్తామని అర్జున అవార్డు గ్రహీత ఇండియన్ బ్లైండ్ క్రికెట్ మాజీ కెప్టెన్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కోచ్ అజయ్కుమార్ రెడ్డి  విశ్వాసం వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య జరిగిన మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో ఆంధ్రప్రదేశ్ జట్టు సంపూర్ణ ఆధిపత్యం చాటుతూ 3 – 0తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆంధ్రప్రదేశ్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. బ్యాటింగ్లో కే. వైకుంఠ (59), ఆర్. వెంకటేష్ (56) మరియు అశోక్ రెడ్డి (56) అద్భుతంగా రాణించారు.లక్ష్య ఛేదనకు దిగిన తెలంగాణ జట్టు ఆంధ్రప్రదేశ్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక కేవలం 12.5 ఓవర్లలో 38 పరుగులకే ఆలౌట్ అయింది. బౌలింగ్లో లోకేష్ 4 ఓవర్లలో 11 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి తన కెరీర్లోనే ఉత్తమ ప్రదర్శన నమోదు చేయగా, దుర్గారావు రెండు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు.ఈ మ్యాచ్లో అద్భుతమైన బౌలింగ్కు గాను లోకేష్కు “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు లభించింది. మొత్తం టోర్నమెంట్లో స్థిరమైన ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు ఈ విధంగా అందజేశారు.బి1 కేటగిరి అశోక్ రెడ్డి, బి2 కేటగిరి — రెడ్డి వెంకటేష్, బి3 కేటగిరి వైకుంఠ.మొత్తంగా ఆంధ్రప్రదేశ్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనూ మెరుగైన ప్రదర్శన కనబరచి ఈ మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ ను 3-0తో ఘనంగా గెలుచుకుంది. ఈ మ్యాచ్లు ఏలూరులో ఘనంగా నిర్వహించడానికి కృషి చేసిన కె. మదన్ మరియు కె.జయరాజు క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రవీంద్రబాబు అభినందిచారు.

About Author