పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని పరిరక్షించాలి
1 min read

ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే “స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర” కార్యక్రమఓ
ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయితే మంచి ఫలితాలు వస్తాయి
శుభ్రమైన -ఆరోగ్యకరమైన ఏలూరు, మీ ఫిర్యాదు – మా ప్రాధాన్యం 9491041419 వాట్సాఫ్ ఫోన్ నెంబరు, గడపగడపకు అవగాహన గోడ పత్రికలను ఆవిష్కరణ
జిల్లా కలెక్టరుతో పాటు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్, ఏపియస్ ఆర్టీసీ విజయవాడ -2 చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు సంయుక్తంగా పాల్గొన్నారు
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక తంగెళ్ళమూడి 1వార్డు సచివాలయం వద్ద 27, 28వ డివిజన్ల పరిధిలోని శనివారం భారతీయ ఆహార సంస్థ గోడౌన్లు ఏటిగట్టు ప్రాంతంలో “స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో భాగంగా “ఈ-వేస్ట్ సేకరణ థీమ్”తో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్, ఏపియస్ ఆర్టీసీ విజయవాడ -2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు సంయుక్తంగా పాల్గొని, అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వార్డు సచివాలయ ప్రాంగణంలో మొక్కలను నాటారు.ముందుగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఏటిగట్టు ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించి, క్లాప్ మిత్రాలతో మాట్లాడారు. రోజుకు ఎన్ని గంటలు పని చేస్తారు, ఏఏ ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేస్తారు అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు ఉదయం ముందుగా రోడ్లను శుభ్రం చేసి చెత్తను ఒక చోట ప్రోగు చేసి, ఇంటింటికి వెళ్ళి తడి, పొడి చెత్తను సేకరిస్తామని తెలిపారు. దీంతో జిల్లా కలెక్టరు స్పందిస్తూ అంతా బాగా చేసినా అన్ని చోట్ల చెత్త ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. దీంతో క్లాఫ్ మిత్రాలు ఇంటింటికి వెళ్ళినప్పుడు పనులు ఉన్నాయని చెత్తను తర్వాత ఇస్తామని చెప్పి తర్వాత రోడ్డు ప్రక్కల, బయట చెత్తను వేస్తున్నారని, పట్టణ ప్రాంతాల్లో కల్యాణ మండపాలు, కన్వెన్షన్ సెంటర్స్ వద్ద కార్యక్రమాలు అయిన తర్వాత చెత్తను రాత్రి సమయాలలో ఇక్కడకు తరలించి చెత్తను వేస్తున్నారని చెప్పారు. దీంతో స్పందిస్తూ జిల్లా కలెక్టరు శాశ్వత చర్యలకు నగరపాలక సంస్థ కమిషనరుకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ-వెస్ట్ సేకరణ కార్యక్రమాన్ని జిల్లాలో అన్ని మండలాలు, మునిపాలిటీలో ఒక మహోద్యమంగా జరుగుతున్నాయన్నారు. ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాలు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, దీనివల్ల వ్యాధులు దూరం అవుతాయని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని పరిరక్షించడం ఒక అభిరుచిగా చేసుకోవాలన్నారు. మన ఇంటితోపాటు చుట్టు ప్రక్కల పరిసరాలు పరిశుభ్రత కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, ఏలూరు ఉడా చైర్మన్ పెద్దిబోయిన శివ ప్రసాదు, జిల్లా వివిధ శాఖలు అధికారులు, సంబంధిత డివిజన్ల కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పట్టణ ప్రముఖులు, నగర పాలక సంస్థ ఉద్యోగులు, వార్డు సచివాలయ ఉద్యోగులు, పట్టణ పలు విద్యాసంస్థలు విద్యార్థులు, యన్ సిసి, యన్ ఎస్ ఎస్, పలు సేవా సంస్థలు సభ్యులు, స్థానిక ప్రజలు, క్లాప్ మిత్రాలు, తదితరులు పాల్గొన్నారు.

