అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలి
1 min read

న్యూస్ నేడు, పత్తికొండ: ఎంతోకాలంగా అపరిస్కృతంగా ఉన్న అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు కాంతమ్మ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 23 నుండి 27 వరకు దీక్షలు చేస్తామని ఆమె తెలిపారు. ఈ మేరకు పత్తికొండ సి డి పి ఓ కు వినతి పత్రం సమర్పించారు.అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నాయకురాలు కాంతమ్మ ఎఐటియుసి జిల్లా డిప్యూటీ కార్యదర్శి ఎన్ కృష్ణులు మాట్లాడుతూ,ఫిబ్రవరి నుండి జరిగే బడ్జెట్ సమావేశాలలో అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, మిగిలిన మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ కు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని కోరుతూ, దీక్షలు చేపడుతున్నట్లు వారు తెలిపారు.మన రాష్ట్రంలో పేదగర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు అంగన్వాడీవర్కర్లు, హెల్పర్లు, మినీవర్కర్లు, అనేక సేవలు అందిస్తున్నారని, కానీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 2019 నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదని అన్నారు. అంగన్వాడీలకి వేతనాల పెంపు తదితర సమస్యల పరిష్కారం చేయాలని 2023 డిశంబర్ లో 42 రోజుల పాటు చారిత్రాత్మక సమ్మె నిర్వహించాము. ఆ సమ్మె ముగింపు సందర్భంగా 2024 జూలైలో అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని, ఇతర సమస్యలు పరిష్కారం చేస్తామని ప్రభుత్వం మినిట్స్ కాపీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా అంగన్వాడీల వేతనాలు పెంచాలని అనేకమార్లు ప్రభుత్వానికి విన్నవించాం. అయినా నేటి వరకు అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదు. కనీసం రానున్న బడ్జెట్ సమావేశాల సందర్భంగానైనా అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి నాయకురాలు ఈరమ్మ, సుగుణమ్మ,రాబియ, ఏఐటీయూసీ తాలూకా అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

