నిరుపేద ప్రజలకు “మీ ఇంటికి మీ డాక్టర్” మొబైల్
1 min read

జెoడా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
గర్భిణీలు,చిన్నపిల్లలు, వృద్ధులకు,మత్స్యకారులకు నాణ్యమైన వైద్య సేవలు
పశ్చిమగోదావరిజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: గ్రామీణ మరియు తీరప్రాంతాల్లో నివసించే నిరుపేద ప్రజలకు వైద్య సేవలను వారి ముంగిటకే అందించాలనే లక్ష్యంతొ “మీ ఇంటికి మీ డాక్టర్” మొబైల్ మెడికల్ యూనిట్‌ను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మొబైల్ మెడికల్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించి, అనంతరం వాహనంలో ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామీణ నిరుపేదలకు, ముఖ్యంగా తీరప్రాంతాల్లో నివసించే మత్స్యకార కుటుంబాలు, గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఆసుపత్రులకు రాలేని ప్రజలకు ఈ మొబైల్ మెడికల్ యూనిట్ ఎంతో ఉపయుక్తంగా మారుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ సహకారంతో మరియు ఆర్.ఇ.సి ఫౌండేషన్ సిఎస్ఆర్ నిధులతో అమలు చేస్తున్నారని తెలిపారు. సుమారు రూ.1.30 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్ట్‌ను జిల్లాలో మూడు సంవత్సరాలపాటు కొనసాగించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ఏడు జిల్లాల్లో ఆర్.ఇ.సి ఫౌండేషన్ సుమారు రూ.8.40 కోట్లతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని వెల్లడించారు.రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డా.ఎం.ఎస్.వి.ఎస్.భద్రిరాజు మాట్లాడుతూ, ఈ మొబైల్ మెడికల్ యూనిట్ ద్వారా ప్రతి గ్రామానికి వైద్య సేవలను చేరవేయడం తమ లక్ష్యమని తెలిపారు. త్వరలో జిల్లాలో కార్నియా కలెక్షన్ సెంటర్‌ను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా మొబైల్ మెడికల్ వాహనంలో వైద్య పరీక్షలు చేయించుకుని, అందులోని సేవల ప్రాముఖ్యతను వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బి. శివన్నారాయణ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జి.గీతాబాయి, డి.సి.హెచ్.ఎస్ పి.సూర్యనారాయణ, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కీర్తి శ్రవణ్, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ బొబ్బిలి శెట్టి కనకరాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు, రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


